
ముంబై: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్, అయేషా ముఖర్జీ దంపతులు విడిపోయారు. విడాకులు తీసుకున్న ఈ ఇద్దరూ తొమ్మిదేళ్ల తమ మ్యారేజ్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ విషయాన్ని అయేషా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తాను రెండోసారి విడాకులు తీసుకునేంతవరకూ డివోర్స్‌ను ఓ మురికి పదంగా భావించానంటూ సోమవారం ఓ లాంగ్ పోస్ట్ చేసింది. బెంగాల్‌లో పుట్టి మెల్‌బోర్న్‌లో సెటిల్ అయిన మాజీ కిక్ బాక్సర్ అయేషాను ధవన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ద్వారా ఆమెతో ధవన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌కు విడాకులు ఇచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా, వయసులో తనకంటే11 ఏళ్లు పెద్దదైన ఆయేషాతో ధవన్ ప్రేమలో పడ్డాడు. 2014లో వీరిద్దరికీ కొడుకు జొరావర్ పుట్టాడు. పెళ్లయినప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవాళ్లు. అయేషా మొదటి భర్త పిల్లలు అలియా, రియాను ధవన్ దత్తత తీసుకున్నాడు. వాళ్లను ఎంతో ప్రేమగా చూసేవాడు. అందరినీ తనతో పాటు మ్యాచ్‌లు, ఫారిన్ టూర్స్‌కు తీసుకెళ్లేవాడు. అలాగే, భార్యతో కలిసి వర్కౌట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. అలాంటి జంట విడిపోవడం అందరికీ షాక్ కలిగించే విషయం.