
న్యూఢిల్లీ:దేశంలో విద్యారంగాన్ని ప్రపంచస్థాయికి చేర్చేందుకు టీచింగ్–లెర్నింగ్ ప్రాసెస్‌ను నిరంతరం రీడిఫైన్, రీ డిజైన్ చేస్తుండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్‌లో మార్పులు తీసుకొస్తున్నామని, ఇండియా భవిష్యత్తులను నిర్మించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. మంగళవారం ‘శిక్షక్ పర్వ్’ కాంక్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. తాము తీసుకుంటున్న చర్యలతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచ స్థాయిలో కాంపిటీటివ్‌గా మారుతుందని, యువత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిద్ధమవుతారని తెలిపారు. మారుతున్న కాలానికి తగ్గట్లుగా మన టీచర్లు కూడా కొత్త విధానాలు, టెక్నిక్స్‌ను నేర్చుకోవాలని సూచించారు. ‘‘మనం ట్రాన్స్‌ఫార్మేషన్ పీరియడ్‌లో ఉన్నాం. మనకు ఆధునిక, భవిష్యత్ తరాలకు అవసరమైన కొత్త జాతీయ విద్యా విధానం ఉంది. విద్యా రంగంలో ట్రాన్స్‌ఫార్మేషన్స్ కేవలం పాలసీ బేస్డ్ గా కాకుండా.. పార్టిసిపేషన్ బేస్డ్ గా ఉంటాయి’’ అని చెప్పారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నం
కొత్త జాతీయ విద్యా విధానం రూపకల్పన, అమలు విషయంలో విద్యావేత్తలు, ఎక్స్‌పర్టులు, టీచర్ల సహకారాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని, సమాజాన్ని ఇందులో భాగం చేయాలని కోరారు. ‘‘మన ఎడ్యుకేషన్ సెక్టార్ సామర్థ్యాలను కరోనా టైంలో చూశాం. ఎన్నో సవాళ్లు ఉండేవి.. కానీ అన్నింటిని పరిష్కరించారు. ఆన్‌లైన్ క్లాసులు, గ్రూప్ వీడియో కాల్స్, ఆన్‌లైన్ ఎగ్జామ్స్.. వంటి వాటిని గతంలో చాలా మంది ఎన్నడూ వినలేదు’’ అని చెప్పారు. ‘‘శిక్షక్ పర్వ్ సందర్భంగా చాలా కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యమైనవి. ఎందుకంటే దేశం ప్రస్తుతం ‘అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటోంది” అని అన్నారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రతి అథ్లెట్ కనీసం 75 స్కూళ్లను విజిట్ చేయాలని కోరానని, వాళ్లు అంగీకరించారని చెప్పారు. క్రీడాకారులు స్కూళ్లకు వెళ్లడం వల్ల స్టూడెంట్లు స్ఫూర్తి పొందుతారని, ప్రతిభ ఉన్న స్టూడెంట్లు తమ రంగాల్లో మరింతగా రాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్ష్‌నరీ (వినికిడి లోపం ఉన్న వారి కోసం ఆడియో, టెక్స్ట్‌తో కూడిన సైన్ లాంగ్వేజ్ వీడియో), టాకింగ్ బుక్స్ (దృష్టి లోపం ఉన్న వారి కోసం ఆడియో బుక్స్)ను మోడీ ప్రారంభించారు.