ప్రముఖుల నుంచి కోట్లు వసూలు.. బాధితుల్లో టాలీవుడ్ హీరోలు

ప్రముఖుల నుంచి కోట్లు వసూలు.. బాధితుల్లో టాలీవుడ్ హీరోలు

అధిక వడ్డీ పేరుతో సినీ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన వ్యాపారవేత్త శిల్పాచౌదరిని నార్సింగ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. శిల్పతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రూ. కోటి 5 లక్షలు మోసం చేసిందని ఓ బాధితుడు  నార్సింగ్ లో ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేశారు.  పేజ్ త్రీ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్పచౌదరి ప్రముఖుల పేర్లు చెప్పి వారికి అధిక వడ్డీ ఆశ చూపింది. పలువురి ప్రముఖుల నుంచి దాదాపు  రూ. వందల కోట్లు మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. శిల్పాచౌదరి బారిన పడిన వారిలో సినీ ,వ్యాపారవేత్తలు,ఫైనాన్షియర్లు,లాయర్లు ఉన్నారు. ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాము మోసపోయామంటూ పలువురు  ప్రముఖులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం.

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్ల శిల్పా చౌదరిపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు  మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు.  పుప్ఫలాగూడకి చెందిన దివ్యారెడ్డి అనే మహిళ శిల్పపై ఫిర్యాదు చేసిందన్నారు. దివ్యా రెడ్డికి శిల్పా చౌదరికి పదేళ్లుగా పరిచయం ఉందన్నారు. కోటి ఐదు లక్షలు తీసుకొని దివ్యా రెడ్డిని శిల్ప మోసం చేసిందన్నారు.  డబ్బులు ఆడిగేందుకు వెళ్లిన దివ్యా రెడ్డిని శిల్ప తన బౌన్సర్లతో బెదరింపులకు పాల్పడిందన్నారు.  

 సినీ ప్రముఖులు , రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలపై విచారణ జరుపుతున్నామన్నారు.  ఇప్పటికే ఐదుగురు భాదితులు వీరిపై ఫిర్యాదు చేశారన్నారు. ఐపీసీ 406 ,420, 341, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.  మరింత దర్యాప్తు కోసం దంపతులను కష్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు.