‘జటాధర’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఇందులోని తన క్యారెక్టర్ ఇంటరెస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది శిల్పా శిరోద్కర్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ చెప్పిన విశేషాలు.
‘‘ముప్ఫై ఐదేళ్ల క్రితం ‘బ్రహ్మ’ చిత్రంలో నటించాను. మళ్లీ ఇన్నేళ్లకు తెలుగు తెరపై కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ‘జటాధర’ చిత్రంలో శోభ పాత్రలో కనిపిస్తా. ఇది చాలా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే రిచ్ అయిపోవాలి అనుకునే క్యారెక్టర్. ఇలాంటి పాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ క్లియర్ విజన్, సపోర్ట్‌తో చేయగలిగాను. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయి. ఎమోషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. వండర్‌ఫుల్ మ్యూజిక్‌తో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆడియెన్స్‌కి కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సుధీర్ బాబు చాలా డెడికేషన్‌తో ఈ ప్రాజెక్ట్ చేశారు. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సుధీర్ మాకు రిలేటివ్ అయినప్పటికీ సెట్‌లో మేము చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాళ్లం. ఈ మూవీ ట్రైలర్‌ను మహేష్ బాబు లాంచ్ చేసి ఇండస్ట్రీలోకి వెల్‌కమ్ చెప్పడం మరింత హ్యాపీనెస్ ఇచ్చింది. ‘బ్రహ్మ’కి ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందింది. కంటెంట్ పరంగా టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్ అయ్యాం. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ ఫేజ్‌లో ఉంది’’.
