బిహార్‌‌కే ఉచిత వ్యాక్సినా?.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్‌‌లో ఉన్నాయా?

బిహార్‌‌కే ఉచిత వ్యాక్సినా?.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్‌‌లో ఉన్నాయా?

బీజేపీపై మండిపడిన శివ సేన
ముంబై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తామనడంపై దుమారం రేగుతోంది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంపై రాజకీయాలు చేయడం ఏంటంటూ విపక్షాలు బీజేపీపై భగ్గుమంటున్నాయి. మహారాష్ట్రలోని అధికార శివ సేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌‌లో బీజేపీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. బిహార్‌‌కు మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా? మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్‌‌లో ఉన్నాయా అంటూ శివ సేన మండిపడింది. బీజేపీవి చెత్త రాజకీయాలు అంటూ విమర్శించింది.

‘బిహార్‌‌కు వ్యాక్సిన్ అందించడంలో తప్పు లేదు. కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అవి పాకిస్తాన్‌‌లో లేవు కదా? మొత్తం దేశం కరోనాతో బాధపడుతున్న ఈ సమయంలో టీకాపై రాజకీయాలు చేయడం ఏంటి? వ్యాక్సిన్ బిహార్‌‌కు మాత్రమే సొంతం కాదు. టీకాపై అందరికీ సమాన హక్కు ఉంది. కుల, మత, రాష్ట్ర బేధాలు లేకుండా అన్నింటికీ అతీతంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీని చేపట్టాలి. బీజేపీకి ఎవరు సలహాలు ఇస్తున్నారు? వాళ్ల నాయకత్వానికి అసలు ఏమైంది? రెండ్రోజుల క్రితమే ప్రధాని మోడీ మాట్లాడుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ అందిస్తామని చెప్పారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం బిహార్ ప్రజలకే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ డిక్లరేషన్ ఇచ్చింది’ అని శివ సేన పేర్కొంది.