అసంతృప్త ఎమ్మెల్యేల మూడు పేజీల లేఖ

అసంతృప్త ఎమ్మెల్యేల మూడు పేజీల లేఖ

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సిందేనని ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. బుధవారం తెల్లారేసరికల్లా సూరత్ నుంచి గౌహతి చేరుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు.. ఏక్ నాథ్ షిండేనే తమ నాయకుడని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అంటూ తీర్మానం చేసి, గవర్నర్ కు లేఖను పంపారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరైనా తనను సీఎం కుర్చీ నుంచి దిగిపొమ్మంటే సంతోషంగా రాజీనామా చేస్తానని థాక్రే వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో...రెబల్ ఎమ్మెల్యేలు రాసిన మూడు పేజీల లేఖను ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియాల ో పోస్టు చేశారు.

మూడు పేజీల లేఖలో పలు అంశాలను రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఎమ్మెల్యేల మాటలు ఎప్పుడూ సీఎం వినలేదని, వారి బాధలు కూడా అర్థం చేసుకోలేదన్నారు. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని లేఖలో ఆరోపించారు. ఎమ్మెల్యేల మనోభావాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పనుల కోసం, ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలవాలని చాలాసార్లు ప్రయత్నించామని చెప్పారు. చివరకు కలవొచ్చనే సందేశం వచ్చినా.. అధికారిక నివాసం గేటు వద్ద గంటల తరబడి నిలబడాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోతుండడంతో తాము విసుగు చెందామన్నారు.

లక్షలాది ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల అవమానకరంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వివరించారు. వీటన్నింటినీ తామందరం భరించామని, అధికార యంత్రాగం నుంచే కాక కాంగ్రెస్ - ఎన్సీపీ నుంచి అవమానాలు ఎదురయ్యాయని వారు పేర్కొన్నారు. అయోధ్యకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రాజ్యసభ ఎన్నికల్లో శివసేన ఒక్క ఓటు కూడా చీల్చలేదన్నారు. దీంతో పాటు ఇంకెన్నో అంశాలను లేఖలో వారు ప్రస్తావించారు.