కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

​​​​​​ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడంలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ తో షిండే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు బాల్ థాక్రే ప్రస్తావన తెస్తే చట్టపరమైన చర్యలకు దిగుతామని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 27లోగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇటు మహారాష్ట్రలో శివసైనికుల ఆందోళన కొనసాగుతోంది. రెబల్స్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.

మరో వైపు తాము శివసేనను వీడలేదని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. పార్టీలో ప్రత్యేక బృందంగా ఉంటామన్నారు. శివసేన బాలాసాహెబ్ అధ్యక్షుడిగా ఏక్ నాథ్ షిండేను ఎన్నుకుంటున్నామన్నారు. శివసేన పార్టీని ఎన్సీపీ, కాంగ్రెస్ హైజాక్ చేశాయని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ ఆరోపించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని అసెంబ్లీలో నిరూపించుకుంటామన్నారు. శివసేనను ఏ రాజకీయ పార్టీలో కలపమని స్పష్టం చేశారు. 

మరో వైపు రెబల్ ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయి. హోటల్ బిల్లులు ఎవరు కడుతున్నారంటూ ఎన్సీపీ ఫైర్ అయింది. దీనిపై ఐటీ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. చార్టెడ్ ఫ్లైయిట్ లకు డబ్బులెవరిస్తున్నారని ఎన్సీపీ నేతలు ప్రశ్నించారు. శివసేన పేరు లేకుండా గెలిచే దమ్ముందా అంటూ రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.

శివసేన లేకుండా పోరాడేందుకు రెబల్స్ కు దమ్ముంటే తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఆధిత్య థాక్రే తెలిపారు. దేశ ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వబోమన్నారు. తమ ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారని ఆరోపించారు. రోజుకు 9లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండి పని చేసిన సీఎం ఉద్దవ్ తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారన్నారు. దేశం మొత్తం ఈ రాజకీయాలను గమనిస్తోందని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.