క్యాట‌రింగ్ ఓన‌ర్‌పై చేయి చేసుకున్న శివ‌సేన ఎమ్మెల్యే

 క్యాట‌రింగ్ ఓన‌ర్‌పై చేయి చేసుకున్న శివ‌సేన ఎమ్మెల్యే

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన శివ‌సేన ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.  ఓ క్యాట‌రింగ్ ఓన‌ర్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కూలీల కోసం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. కూలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పరిశీలించేందుకు వచ్చినట్లుగా  బంగర్‌ తెలిపారు.

ఈ క్రమంలో నిర్వాహకుడితో బంగర్‌ దుర్భాషలాడుతూ  అతని చెంప చెల్లుమ‌నిపించాడు. అంతేకాకుండా గట్టిగా చివాట్లు పెట్టాడు.  " పగలు, రాత్రి కష్టపడే పేదలకు మహారాష్ట్ర ప్రభుత్వం మంచి భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ కొందరు కాంట్రాక్టర్లు సరైన ఆహారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారు. కూలీలకు నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఆ భోజనాన్ని చూస్తే మీరు కూడా నాలాగే చేసి ఉండేవారు" అని బంగర్‌ మీడియాతో అన్నారు.

హింగోలీ నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్రాతినిథ్యం  వహిస్తున్న  సంతోష్ బంగ‌ర్.. జూలైలో జ‌రిగిన అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో చివ‌రి నిమిషంలో షిండే వ‌ర్గంలో చేరారు.