రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్‌ రౌత్ బంపర్ ఆఫర్

రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్‌ రౌత్ బంపర్ ఆఫర్

మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. షిండే వర్గం ముంబై వచ్చి మాట్లాడితే మహా వికాస్ అఘాడి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక కామెంట్స్ చేశారు. 24 మంది ఎమ్మెల్యేలు థాక్రేకు టచ్ లో ఉన్నారన్నారు. అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలంతా శివసేన వెంటే ఉంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా లేదన్నారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్, ఎన్సీపీ అప్రమత్తమైంది. కాసేపట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ కానున్నారు. తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. మహా వికాస్ అఘాడి నుంచి శివసేన వెళ్లిపోతే..తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హెచ్ కే పాటిల్, బాలాసాహేబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్ లతో సహా సీనియర్లు హాజరుకానున్నారు. 

ఏక్ నాథ్ షిండే వెంట ఉన్న ఎమ్మెల్యేలను బలవంతంగా క్యాంప్ లకు తరలిస్తున్నారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ ఆరోపించారు. సూరత్ క్యాంప్ నుంచి తాను పారిపోయేందుకు ప్రయత్నిస్తే పోలీసులు పట్టుకున్నారని ఆరోపించారు. చాలా మంది ఎమ్మెల్యేలను ఏక్ నాథ్ షిండే బలవంతంగా నిర్బంధించాడని ఆరోపించారు. ఇక ప్రస్తుతం అసోం గువాహాటి క్యాంప్ లో ఉన్నారు షిండే వర్గం ఎమ్మెల్యేలు. తమకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఏక్ నాథ్ షిండే తెలిపారు. అసలైన శివసేన తమదే అంటూ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు. ఇందులో మొత్తం 35 మంది శివసేన ఎమ్మెల్యేలు.. ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. అటు శివసేన భేటీకి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే వస్తామంటూ ఏక్ నాథ్ వర్గం ప్రకటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ఉద్ధవ్ థాక్రే అపాయింట్ మెంట్ ఇస్తూ, నిధులు కూడా వారికే కేటాయింపులు చేస్తున్నారని రెబల్ శివసేన ఎమ్మెల్యేలు బహిరంగ లేఖతో తమ ఆవేదన చెప్పుకున్నారు.

సీఎం అపాయింట్ మెంట్ కూడా దొరకట్లేదని ప్రస్తావించారు. ఇక అవసరమైతే విపక్షంలో కూర్చోవడానికి సిద్ధమని ఎన్సీపీ ప్రకటించింది. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్న నమ్మకం ఉందని జయంత్ పాటిల్ అన్నారు. శివసేనలో అంతర్గత విబేధాలపై తనకు తెలియదన్నారు. మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్నికూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బాల్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు పని చేయాలని సూచించారు. శివసేన ఆందోళనలతో బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.