ఏక్నాథ్ పై ‘శివసేన’ వేటు.. పార్టీ పదవి నుంచి తొలగింపు

ఏక్నాథ్ పై ‘శివసేన’ వేటు.. పార్టీ పదవి నుంచి తొలగింపు

అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేసిన పార్టీ సీనియర్ నేత , మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండేపై శివసేన చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ లీడర్ పదవి నుంచి ఆయనను తప్పించింది. ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న  మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి షిండే తిరుగుబాటు రూపంలో ఇప్పుడు మరో షాక్ తగిలింది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి షిండే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ  కూటమి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ  కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఓ ప్రకటన విడుదల చేశారు.  ఉద్ధవ్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో ఇలాంటి క్యాంపు రాజకీయాలు చూడటం ఇది మూడోసారి అని వ్యాఖ్యానించారు.