ఠాక్రే, షిండే వర్గాల పిటిషన్లపై విచారణ 1కి వాయిదా

ఠాక్రే, షిండే వర్గాల పిటిషన్లపై విచారణ 1కి వాయిదా

శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ  ఏక్ నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఏక్ నాథ్ షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఉద్ధవ్ థాక్రే తరఫున అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ధర్మాసనం పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు అనర్హత నోటీసులపై స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సూచించింది. ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలపై విచారణను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తామని తెలిపింది. అయితే జులై 27 (వచ్చే బుధవారం) కల్లా  ఇరువర్గాలు వారి వారి వాదనలకు బలం చేకూర్చే పత్రాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

‘‘ ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలు రాజ్యాంగంతో ముడిపడినవి అయినందున.. వాటిపై సత్వరం వాదనలు వినాల్సిన అవసరం ఉంది. ఇరువర్గాలు వచ్చే మంగళవారంకల్లా అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలపై విచారణను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘‘శాసన సభా పక్ష నాయకుడిని తొలగించడం అనేది పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. దీనిపై ఏదైనా వివాదం, సందేహం ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. 

స్పీకర్ ఎన్నిక చెల్లదు.. 

థాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా.. షిండేతో ముఖ్యమంత్రిగా గవర్నర్‌ ఎలా  ప్రమాణస్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. అనర్హత నోటీసులున్న ఎమ్మెల్యేలు ఓటేసిన అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక చెల్లదని వాదించారు. ‘‘ఈ కేసులో షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే.. దేశంలో ప్రతి ప్రభుత్వాన్ని ఇలాగే కూలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కుప్పకూలితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అని సిబల్ పేర్కొన్నారు. ‘‘శివసేన విప్ జారీ చేసినా రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ సమావేశానికి హాజరు కాలేదని.. అలాంటి వాళ్లు కొత్త శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు’’ అని ఉద్ధవ్ థాక్రే వర్గం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు.  

20 మంది ఎమ్మెల్యేలు లేరు.. అధికారం కావాలా ? 

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే వర్గం వాదనలకు షిండే వర్గం ధీటుగా బదులిచ్చింది. షిండే తరఫున హరీశ్ సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ‘‘పార్టీలో ఒక వ్యక్తికి అధిక మద్దతు ఉంటే అతను పార్టీని వదిలిపెట్టకుండా.. నాయకుడిని ప్రశ్నిస్తే అది ఫిరాయింపు ఎలా అవుతుంది ? కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూర్చుకోలేని ఓ వ్యక్తి కోర్టుల ద్వారా అధికారంలోకి రావాలనుకునే ఊహా ప్రపంచంలో మనం ఉన్నామా?’’ అని సాల్వే ప్రశ్నించారు.