మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం.. అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. శ్రీశైల దేవస్థానంలో  మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలు గురువారం సంప్రదాయబద్దంగా ఘనంగా  ప్రారంభమయ్యాయి.  నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు  బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిగాయి. దేవస్థానం ఈవో కే ఎస్ రామ రావు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. తర్వాత స్థానాచార్యులు , లోకక్షేమాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్స సంకల్పాన్ని (శివసంకల్పం) పఠించారు. శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే కరోనా వైరస్ మొదలైనవి నశించాలని కూడా వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం తరువాత చండీశ్వర పూజ చేశారు.ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన జరిగింది . అనంతరం వాస్తుపూజ తరువాత వాస్తు హోమం చేసారు . అనంతరం మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన తరువాత పంచావరణార్చనలు చేశారు. లోకకల్యాణం కోసం జపానుష్టానాలు జరిగాయి.

కరోనా నివారణ చర్యలు

ఆలయాన్ని దర్శించే భక్తులను దృష్టిలో ఉంచుకుని,  కరోనా నివారణ చర్యలలో భాగంగా పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు తప్పనిసరిగా భౌతికదూరాన్ని పాటించడం,  మాస్కును ధరించడం, శానిటైజర్తో చేతులను తరుచుగా శుభ్రపరుచుకోవడం లాంటి ముందు జాగ్రత్తలలు పాటించాలంటూ నిరంతరం సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్

టీఆర్ఎస్… అంటే టోటల్ రివర్స్ స్టాండ్