శివరాత్రి అర్ధరాత్రి.. భూతాలు, దెయ్యాలకు పూజలు

శివరాత్రి అర్ధరాత్రి.. భూతాలు, దెయ్యాలకు పూజలు

కడప : శివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగిపోతాయి. భక్తుల ఉపవాసాలు, పరమశివుడికి అభిషేకాలు, పూజలతో సందడిగా గడిచిపోతుంది. అయితే కడప జిల్లాలోని పొలతల మల్లేశ్వర స్వామి శైవక్షేత్రం మాత్రం డిఫరెంట్. ఓవైపు మల్లేశ్వరస్వామికి పూజలు జరుగుతుంటే…పక్కనే బూతాలు, దెయ్యాలకు పూజలు జరుగుతాయి.

దెయ్యాలు వదిలించడం, భూత, ప్రేత పూజలు… ఇక్కడ సాధారణం. అమాయకత్వమే అసరా… ఆవగాహనా రాహిత్యమే  ఆదాయ వనరుగా మార్చకుంటున్నారు మంత్రగాళ్లు. సంతానం లేకపోతే పూజలు, దెయ్యం వదిలించేందుకు పూజలు చేస్తామని నమ్మిస్తూ మినిమం 5 వేల రూపాయలు అట్నుంచి ఒంటిమీదున్న నగలన్నీ నిలువుదోపిడీ సమర్పించే వరకు వదిలిపెట్టరు భూతవైద్యులు.

పొలతల మల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో భూతవైద్యుల దందా యధేచ్చగా సాగుతోంది. పొలతలలో బ్రహ్మోత్సవాలతో పాటు సోమ, శుక్రవారాల్లో మహిళలు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని, వారి అమాయకత్వాన్ని, సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. పొలతలలో చెట్ల క్రింద చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తారు.

సంతానం కలిగిస్తామని పూజలోకి దించి అమ్మవారు పూనినట్టుగా ఊగిపోతూ కీడు ఉందని శాంతి చేసుకోవాలంటూ సూచిస్తారు. ఇందుకు 5 వేల రూపాయలు చెల్లించాలి. శాంతి చెయ్యాలంటూ మరో వారం రమ్మంటారు. ఆ రోజున వెళితే మహిళ తన ఒంటిపై ఉన్న నగలన్నీ సమర్పించుకోవాల్సి వస్తుంది. పూజ పేరుతో హింస జరుగుతుంది. దెయ్యం పట్టినట్టుగా ఊగిపోయే వ్యక్తిని చావగొడుతూ చిత్రహింసలు పెడతారు. శాశ్వత పరిష్కారం కోసం మరోసారి రమ్మంటారు. లేదంటే సమస్య మొదటికొస్తుందని భయపెడతారు. మల్లేశ్వరస్వామి ఆలయ పరిధిలోనే ఇదంతా జరుగుతున్నా…ఆలయ అధికారులు పట్టించుకోరు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.