చాన్స్ వస్తే ఇండియా టీమ్​కి కోచ్​గా పన్జేస్త : షోయబ్ అక్తర్

చాన్స్ వస్తే ఇండియా టీమ్​కి కోచ్​గా పన్జేస్త : షోయబ్ అక్తర్

కరాచి: ఆఫర్ వస్తే ఇండియన్ క్రికెట్ టీమ్ కు బౌలింగ్ కోచ్ కావడానికి సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్ చేశారు. భారత బౌలింగ్ కోచ్ కావడానికి ఆసక్తి చూపుతున్నానని, తన టాలెంట్​తో మరింతమంది ఫాస్ట్ బౌలర్లను తయారు చేయగలనని చెప్పారు. సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ‘హలో’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడారు. భవిష్యత్తులో భారత బౌలింగ్ యూనిట్‌తో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు. ‘‘నా అనుభవాన్ని, టాలెంట్​ను ఇప్పుడున్న యువ క్రికెటర్లకు పంచేందుకు రెడీగా ఉన్నాను. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని తప్పకుండా వ్యాప్తి చేస్తాను”అని అన్నారు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో కోల్ కత నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించిన అక్తర్.. తనకు చాన్స్ వస్తే నైట్ రైడర్స్‌ టీమ్​కు కోచ్ గా పనిచేస్తానన్నారు.

సచిన్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది
సచిన్ టెండూల్కర్ తో తనకున్న అనుబంధాన్ని అక్తర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1998 సిరీస్‌లో మొదటిసారి సచిన్ కు బౌలింగ్ చేసిన విషయం గురించి మాట్లాడారు. ‘‘సచిన్ పేరు అప్పటికే తెలుసు. కానీ, ఇండియాలో ఆయనను క్రికెట్ దేవుడిలా ఆరాధిస్తారని మాత్రం చెన్నై మ్యాచ్ టైంలోనే తెలిసింది. ఫాస్ట్ బౌలర్ అయిన నాకు కూడా ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు”అని అక్తర్ చెప్పుకొచ్చారు.