ద్రవిడ్ నాకోసం రెండు గంటలు వెయిట్ చేశారు: షోయబ్ మాలిక్

ద్రవిడ్ నాకోసం రెండు గంటలు వెయిట్ చేశారు: షోయబ్ మాలిక్

అంతర్జాతీయ క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బ్యాటర్ గా వికెట్ కీపర్ గా కెప్టెన్ గా భారత జట్టుకు ఎన్నో సేవలను అందించాడు. జట్టు గెలవడం కోసం అనుక్షణం పరితపించే ద్రవిడ్.. ఒక క్రికెటర్ గానే కాకుండా.. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనసు క్రికెట్ లో ద్రవిడ్ కు మంచి గుర్తింపు తీసుకొని వచ్చింది. తాజాగా ఈ మిస్టర్ డిపెండబుల్ వ్యక్తిత్వం గురించి పాక్ మాజీ స్టార్ బ్యాటర్ షోయబ్ మాలిక్ ప్రశంసించాడు. 

పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌-ఏ చానెల్‌తో మాట్లాడిన షోయబ్‌ మాలిక్‌.. ద్రవిడ్ గురించి ఒక సంఘటనను పంచుకున్నాడు. " ఆ రోజు మేము పాకిస్థాన్ నుంచి న్యూజీలాండ్ కు వెళ్తున్నాం. భారత అండర్-19 క్రికెట్ జట్టు కూడా ఆరోజు మాతో పాటే విమానంలో ప్రయాణం చేస్తుంది. రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19 టీమ్‌కు కోచ్‌గా ఉన్నాడు. ఆ రోజు నాకు నిద్ర రావడంతో నిద్ర పోయాను. కానీ ద్రవిడ్ నా కోసం రెండు గంటల పాటు ఎదురు చూసాడు. నేను లేచిన తర్వాత నువ్వు ఎన్నో ఒడిదుడుకులను ఎదర్కొని మళ్ళీ జట్టులో ఎలా రీ ఎంట్రీ ఇచ్చావు అని నన్ను అడిగాడు. ఈ విషయం కుర్రాళ్లకు చెబితే చాలా స్ఫూర్తిగా ఉంటుంది" అని ద్రవిడ్ నాతో మాట్లాడాడని మాలిక్ చెప్పుకొచ్చాడు. 

ద్రవిడ్ కు అస్సలు ఈగో ఉండదని.. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనలో ఉంటాడని అందుకే టీమిండియా ఈ రోజు ఈ స్థాయిలో ఉందని ఈ దిగ్గజ బ్యాటర్ ను ఆకాశానికెత్తేసాడు. వరల్డ్ కప్ లో టీమిండియా చాలా బాగా ఆడుతుందని.. భారత్ కప్ గెలవాలంటే ద్రవిడ్ సూచనలు చాలా కీలకమని మాలిక్ అన్నాడు. మొత్తానికి ఒక పాకిస్థాన్ క్రికెటర్ ద్రావిడ్ ను ప్రశంసించాడంటే అతని గొప్పతనం ఏంటో తెలుస్తుంది. 

 కాగా.. పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 1999లో అడుగుపెట్టిన షోయబ్‌ మాలిక్‌ ఇప్పటి వరకు.. 34 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1898..వన్డేల్లో 7534..టీ 20ల్లో 2435 పరుగులు చేసాడు. ఇక బౌలర్ గాను రాణించి టెస్టుల్లో 32.. వన్డేల్లో 158..టీ 20 ల్లో 28 వికెట్లు పడగొట్టాడు.