
భార్యను ముక్కలు చేసి మూసీలో పడేసిండు
హైదరాబాద్ మేడిపల్లిలో దారుణంమృతురాలు 4 నెలల గర్భిణి
కాల్ సెంటర్లో పని చేస్తున్న స్వాతి
తరుచూ ఫోన్లో మాట్లాడుతోందని భర్త అనుమానం
అబార్షన్‌కు ఒప్పుకోవట్లేదని గొంతు నులిమి హత్య
బావ నిలదీయడంతో నేరం ఒప్పుకొని పోలీసుల ముందు నిందితుడు సరెండర్
మేడిపల్లి, వెలుగు: భార్యను చంపి డెడ్‌బాడీని రంపంతో ముక్కలు చేసి మూసీలో పడేశాడు. తన భార్య తరుచూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏం తెలవనట్లు మిస్సింగ్ నాటకం ఆడాడు. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో చోటు చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ పద్మజారాణి ఆదివారం బోడుప్పల్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి పక్కపక్క ఇండ్లల్లో ఉండేవారు.
స్వాతి చేవెళ్ల హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది. అప్పుడప్పుడు ఊరికి వస్తూపోతుండేది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డితో ప్రేమలో పడింది. తాను మహేందర్ రెడ్డితో వెళ్తున్న అని స్వాతి లెటర్ రాసి వెళ్లిపోయింది. తర్వాత కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత ఎవరి ఇండ్లలో వారు ఉండేవారు. 2023లో మళ్లీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మొదట ఆర్య సమాజ్‌లో, తర్వాత యాదగిరిగుట్టలో పెండ్లి చేసుకున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ కాగా, స్వాతి పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్లో టెలీ కాలర్గా పని చేస్తున్నది. వీరిద్దరూ బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. స్వాతి కాల్ సెంటర్లో జాబ్‌చేస్తూ ఇంట్లోనూ ఆఫీస్ కాల్స్ మాట్లాడుతూ ఉండేది.
‘‘ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటావ్.. ఎవరితో మాట్లాడుతున్నావ్.? ఎందుకు మాట్లాడుతున్నావ్? లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు’’అంటూ స్వాతిని మహేందర్ రెడ్డి అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం స్వాతి 4 నెలల గర్భవతి కావడంతో మరింత అనుమానం పెంచుకున్నాడు. 2023లో కూడా ప్రెగ్నెంట్ అయితే.. అబార్షన్ చేయించాడు. ఇప్పుడు మళ్లీ అబార్షన్ చేయిస్తానని పట్టుబట్టడంతో ఆమె మొండికేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందే.. వికారాబాద్‌లో మహేందర్‌రెడ్డిపై స్వాతి 498ఏ కేసు కూడా పెట్టింది. తర్వాత పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు.
ప్లాన్ ప్రకారమే హత్య
స్వాతిని ఎలాగైనా చంపాలని మహేందర్ రెడ్డి డిసైడ్ అయ్యాడు. శవం దొరికితే తాను పట్టుబడతానని అనుకున్నాడు. డెడ్‌బాడీనే మాయం చేస్తే.. ఎటో వెళ్లిపోయిందని అందరినీ నమ్మించాలని ప్లాన్ వేశాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఓ షాప్‌కు వెళ్లి యాక్సా బ్లేడ్ కొని ఇంట్లో పెట్టుకున్నాడు. మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లే విషయంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అబార్షన్ చేసుకోవాలని మహేందర్ రెడ్డి ఒత్తిడి చేశాడు. ‘‘ఇప్పటికే ఒకసారి అబార్షన్ చేయించినవ్.. ఇప్పుడు మళ్లీ అబార్షన్ చేయిస్తా అంటున్నావ్.. ఎన్ని సార్లు అబార్షన్ చేయించుకోవాలి? నాకు తల్లి కావాలని ఉంది. నీ నిర్ణయం మార్చుకో’’అంటూ స్వాతి వేడుకున్నది. అయినా మహేందర్ రెడ్డి వినిపించుకోలేదు. ఈ విషయంలో మాట మాట పెరిగి స్వాతిని గొంతు నులిమి చంపేశాడు.
3 సార్లు బైక్ మీద వెళ్లి ముక్కలు పడేసిండు
అప్పటికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న యాక్సా బ్లేడును రంపానికి బిగించి బాడీని ముక్కలు చేశాడు. ముందు ఆమె తల, తర్వాత కాళ్లను చివరికి చేతులను మొండెం నుంచి వేరు చేశాడు. మొండాన్ని వదిలేసి మిగిలిన భాగాలను మళ్లీ పీసులుగా కట్ చేసి కవర్లలో వేసుకున్నాడు. శనివారం రాత్రి 6 కిలో మీటర్ల దూరంలోని ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం దగ్గర ఉన్న మూసీ నదిలో పడవేశాడు. దీని కోసం అతడు ఇంటి నుంచి మూసీకి బైక్‌పై 3 సార్లు తిరిగాడు. ఛాతి, నడుం భాగం కోయాలని చూశాడు. అతడితో కాకపోవడంతో రక్తపు మరకలు పోవడానికి నీళ్లతో శుభ్రం చేశాడు. అయినా, మరకలు అలాగే ఉండిపోయాయి. తర్వాత తన బావ, చెల్లికి కాల్ చేశాడు. స్వాతి కనిపించడం లేదని చెప్పాడు.
దీంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లినట్టు తెలిసింది. వారు తమ పరిధిలోకి రాదని, మేడిపల్లి పీఎస్‌కు వెళ్లాలని చెప్పారు. తర్వాత మహేందర్‌రెడ్డిపై బావకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించాడు. భయపడి అసలు విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చాడు. చివరికి శనివారం అర్ధరాత్రి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మిగిలిన డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించి స్వాతి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
దొరకని స్వాతి శరీర భాగాలు
మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు ఆదివారం ఉదయం 8 గంటలకు మహేందర్‌రెడ్డిని ప్రతాప సింగారంకు తీసుకువెళ్లారు. పడేసిన ప్రాంతాన్ని చూపించగా.. గజ ఈతగాళ్లను దింపి గాలించారు. 3 గంటల పాటు వెతికినా ఏం దొరకలేదు. తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆధారాలు సేకరించడానికి క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలో దిగాయి. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వేలిముద్రలు, రక్తపు ఆనవాళ్ల శాంపిల్స్ తీసుకున్నాయి. మహేందర్‌రెడ్డి ఒక్కడే హత్య చేశాడా? లేక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహేందర్ రెడ్డిని ఉరి తీయాలి: స్వాతి తండ్రి
తన బిడ్డను ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి పెండ్లి చేసుకున్నాడని స్వాతి తండ్రి రాములు అన్నారు. ‘‘ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించిండు. హైదరాబాద్‌లో నా బిడ్డను ఒంటరిగా వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయిండు. తినడానికి తిండి కూడా లేకుండే. నా బిడ్డ తిరిగి ఊరికొచ్చినా అత్తగారింటికే వెళ్లింది. వాళ్లు కూడా కష్టాలు పెట్టిన్రు. పంచాయితీ పెట్టి సమస్య పరిష్కరించుకున్నం. కట్నం కోసం వేధించేటోడు. చివరికి నా బిడ్డను చంపి ముక్కలు చేసిండు.
మహేందర్ రెడ్డిని ఉరితీయాలి’’అని రాములు డిమాండ్ చేశాడు. మహేందర్ రెడ్డి ఎప్పుడూ స్వాతితో గొడవ పెట్టుకునేవాడని ఆమె చిన్నమ్మ తెలిపింది. ఫోన్లో మాట్లాడితే అనుమానించేవాడని మండిపడ్డింది. కాగా, కామారెడ్డిగూడలో ఇద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. తన కూతురిని చంపి ముక్కలు చేసిన మహేందర్‌రెడ్డిని సర్కారే సంపాలని, లేకపోతే తానే చంపుతానని స్వాతి తల్లి స్వరూప అన్నారు.