కేరళ మెడికల్ కాలేజీ నుంచి రాజస్థాన్ కు లీకైన పేపర్.. నీట్ పేపర్ లీక్ వెనుక విస్తుపోయే నిజాలు !

కేరళ మెడికల్ కాలేజీ నుంచి రాజస్థాన్ కు లీకైన పేపర్.. నీట్ పేపర్ లీక్ వెనుక విస్తుపోయే నిజాలు !
  • నీట్ రద్దు.. రాజస్తాన్లో ప్రశ్నాపత్రం లీక్‌తో ఎన్టీఏ కీలక నిర్ణయం
  • దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన పరీక్షను క్యాన్సిల్‌ చేస్తున్నట్టు ప్రకటన 
  • విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు
  • పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదు..త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడి  
  • -పేపర్ లీక్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం
  • నాసిక్‌లో ఒకరి అరెస్ట్‌.. దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • గెస్ పేపర్లు, ఎగ్జామ్ మాఫియాలు వైద్యుల భవిష్యత్తును నిర్ణయించలేవు: ఎఫ్‌ఏఐఎంఏ
  • ఇది కేవలం పొరపాటు కాదు.. వ్యవస్థాగత నిర్లక్ష్యమని ఫైర్‌‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షకు ముందు రోజే రాజస్తాన్‌లో ప్రశ్నాపత్రం లీకైనట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. పరీక్షా విధానంలో పారదర్శకతను కాపాడటానికి, వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఏజెన్సీ స్పష్టం చేసింది. 

కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. అలాగే, పరీక్ష ఫీజు కూడా చెల్లించనక్కర్లేదని వెల్లడించింది. అభ్యర్థులు ఇప్పటికే చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తామని, పునర్విచారణకు అయ్యే ఖర్చును ఎన్టీఏ తన అంతర్గత వనరుల నుంచే భరిస్తుందని పేర్కొంది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్‌ కార్డులు రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది.  ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించింది. 

  • సీబీఐ విచారణకు ఆదేశం

నీట్‌ పేపర్‌‌ లీక్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది.  ప్రశ్నాపత్రాలు లీకైన చోటు నుంచి సీబీఐ దర్యాప్తు చేపట్టనున్నది.

  • నాసిక్‌లో ఒకరి అరెస్ట్

నీట్‌ పేపర్​ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ‘‘నీట్ పేపర్ లీక్ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోవాలని రాజస్తాన్ పోలీసుల నుంచి మాకు అభ్యర్థన అందింది. దీనిపై తక్షణమే స్పందించిన క్రైమ్ బ్రాంచ్ యూనిట్-2 నిందితుడిని పట్టుకుంది’’ అని నాసిక్‌ పోలీసులు వెల్లడించారు. త్వరలోనే రాజస్తాన్‌ పోలీసు బృందం నాసిక్ చేరుకుని నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నది.   

పరీక్షా ప్రక్రియ రద్దు వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులపై ఎన్టీఏ విచారం వ్యక్తం చేసింది. అయితే, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటం కోసమే రద్దు నిర్ణయం తీసుకున్నామని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నది. కేవలం అధికారిక వెబ్‌‌సైట్లలో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది. న్యాయబద్ధంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని, విచారణ సంస్థల నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించింది.  

  • ఢిల్లీలో నిరసన జ్వాలలు

పరీక్ష రద్దు నిర్ణయం వెలువడగానే ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం (ఎన్‌‌ఎస్‌‌యూఐ) ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ కార్యాలయం ‘శాస్త్రి భవన్’ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.  కాగా, ఈ పేపర్‌‌‌‌ లీకేజ్‌‌ ఘటనపై డాక్టర్ల సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్’ (ఎఫ్‌‌ఏఐఎంఏ) స్పందించింది. 

గెస్ పేపర్లు, ఎగ్జామ్ మాఫియాలు వైద్యుల భవిష్యత్తును నిర్ణయించలేవని హెచ్చరించింది. ఏండ్లనుంచి కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఇది కేవలం పొరపాటు కాదు, వ్యవస్థాగత నిర్లక్ష్యమని మండిపడింది. పరీక్షా కేంద్రాల వద్ద గెస్ పేపర్ల పంపిణీ, పేపర్ లీకేజీ వెనుక ఉన్న మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అక్రమ మార్గాల్లో వైద్య సీట్లు పొందే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేసింది. పరీక్షా వ్యవస్థపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలగాలంటే బాధ్యులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని అధికారులను కోరింది.

  • అసలేం జరిగింది?

 దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్‌‌ యూజీ 2026 పరీక్షకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే, పరీక్ష ముగిసిన కొద్ది గంటలకే కొన్ని చోట్ల పేపర్ లీక్ అయ్యిందన్న పుకార్లు షికారు చేశాయి. పరీక్ష ముగిసిన రెండు రోజులకు రాజస్తాన్‌‌లోని సికార్, కోటా ప్రాంతాల్లో ఒక ‘ప్రాక్టీసు పేపరు’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులోని ప్రశ్నలు అసలు నీట్ పేపర్‌‌లోని ప్రశ్నలతో సరిపోలడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 

మే 9న రాజస్తాన్‌‌ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ రంగంలోకి దిగడంతో అసలు కథ వెలుగుచూసింది. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్‌‌లో ప్రశ్నాపత్రం చేతులు మారిందని పోలీసు లు గుర్తించారు. సుమారు 600 మార్కులకు పైగా ప్రశ్నలు ముందుగానే బయటకు వచ్చాయని తేలడం తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నెల 10న  ఈ లీకేజీ మూలాలు కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో ఉన్నట్టు దర్యాప్తులో గుర్తించారు. ఒక ఎంబీ బీఎస్ విద్యార్థి ద్వారా ఈ పేపర్ సికార్‌‌కు చేరిందని, అక్కడ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరిం చారు.  

లీకేజీ ఆరోపణలను ఎన్టీఏ ప్రాథమికంగా తోసిపుచ్చినప్పటికీ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం..పరీక్ష పారదర్శకతపై నమ్మకం కలిగించేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ ఊపందుకోవడంతో ఎన్టీఏ దిగిరాక తప్పలేదు.