సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ల ఫోటో విడుదల

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ల ఫోటో విడుదల

ఆదివారం (ఏప్రిల్ 14) తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఖాన్ కుటుంబం నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఈ కాల్పులకు తెగబడిన ఇద్దరి నిందితుల ఫోటోలు రివీల్ అయ్యాయి. 

ఇప్పటికే ఇద్దరు షూటర్లకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలకు కీలక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. బహిర్గతమైన ఫోటోలో ఒకరు తెల్లటి టీషర్ట్, నలుపు జాకెట్, డెనిమ్స్ ధరించి ఉండగా, మరొకరు ఎరుపు రంగు టీషర్ట్, డెనిమ్స్‌లో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు క్యాప్‌లు ధరించి, వీపున బ్యాగ్ లు తాలించుకొని ఉన్నారు. ఫొటోల ఆధారంగా పోలీసులు ఇద్దరి కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ కాల్పుల్లో విదేశీ పిస్టల్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక క్రైమ్ బ్యాచ్ బృందం రంగంలోకి దిగినట్లు క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.