హైదరాబాద్: పొద్దు పొద్దున్నే తుపాకీ మోతతో హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది. శనివారం (జనవరి 31) ఉదయం కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు.
వివరాల ప్రకారం.. రషీద్ అనే వ్యక్తి శనివారం (జనవరి 31) ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఏటీఎమ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో రషీద్‌ను ఫాలో అయిన గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపి రూ.6 లక్షల డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయమైంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ రషీద్‌ను ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పొద్దు పొద్దున్నే కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
