పెరిగిన రిటెయిల్​ సేల్స్​

పెరిగిన రిటెయిల్​ సేల్స్​

న్యూఢిల్లీ:నిన్నమొన్నటి దాకా కౌంటర్ల దగ్గర ఖాళీగా కూర్చున్న షాపుల యజమానులు బిజీ అయిపోయారు. గత ఏడాది పండగ సీజన్ల నుంచి అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం. కరోనా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోవడంతో  మంచిరోజులు వచ్చాయి. ఇక నుంచి బిజినెస్ విస్తరణ ప్లాన్లపై ఫోకస్ చేస్తామని రిటైలర్లు తెలిపారు. రిలయన్స్ రిటైల్, షాపర్స్ స్టాప్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్స్, బాటా,  టైటాన్ వంటి టాప్ రిటైలర్ల అమ్మకాలు అక్టోబర్–-డిసెంబర్ లో ప్రీ-–కోవిడ్ స్థాయిలను దాటాయి. రిలయన్స్ రిటైల్,  ఏబీఎఫ్ఆర్ఎల్ తాజా క్వార్టర్లో అత్యధిక లాభాలను ప్రకటించాయి. పండగలు, పెండ్లిళ్ల సీజన్‌‌‌‌ల కారణంగా షాపులన్నీ కళకళలాడుతున్నాయని కంపెనీల  టాప్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు చెబుతున్నారు. ఆన్‌‌‌‌లైన్ అమ్మకాలు దూసుకెళ్తూనే ఉన్నాయి. మునుపటి క్వార్టర్‌‌తో పోలిస్తే ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లకూ గిరాకీలు పెరిగాయి. ఈ విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి శ్రీకాంత్   మాట్లాడుతూ.. స్టోర్ల వ్యాపారం దాదాపు సాధారణ స్థాయికి వచ్చిందని, ప్రీకోవిడ్ మాదిరిగానే కస్టమర్లు షాపులకు వస్తున్నారని చెప్పారు.  కస్టమర్ల సెంటిమెంట్లు బాగుండటాన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ ఉన్నా లాభాలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని రిటైలర్లు అంటున్నారు. రాబోయే క్వార్టర్లలో షాపులను పెంచుతామని, విస్తరణలను వేగవంతం చేస్తామని చెప్పారు.

మేలు చేసిన వ్యాక్సినేషన్...

బాటా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుంజన్ షా  మాట్లాడుతూ కోవిడ్ కేసుల తగ్గుదలతోపాటు,  15–-18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయడం వల్ల కస్టమర్ల సెంటిమెంట్ మరింతగా పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిలయన్స్ రిటైల్.. డిసెంబర్ లో పెట్రో, రిటైల్,  కనెక్టివిటీ వ్యాపారాలు మినహా రిటైల్ ఆదాయంలో 90 శాతం గ్రోత్ సాధించింది. పండగల అమ్మకాలు బలంగా ఉండటంతో  ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్ వ్యాపారం రెండింతలు పెరిగిందని, కిరాణా అమ్మకాలు రెండంకెల గ్రోత్ సాధించాయని కంపెనీ తెలిపింది. వడ్డీ, పన్ను, తరుగుదల, అప్పుల చెల్లింపునకు ముందు ఇది రూ. 3,822 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 23.8%  పెరిగింది. డీమార్ట్ పేరుతో ఫుడ్ అండ్ గ్రోసరీ చైన్‌‌‌‌ను నడిపే అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌‌‌ అమ్మకాలు డిసెంబర్ లో 22% పెరిగాయి. వాచీలు, నగల రిటైలర్ టైటాన్ ఆదాయం 36% పెరిగింది (బులియన్ అమ్మకాలు మినహా) ఆభరణాల విభాగం బలంగా ఉంది. ఇతర వ్యాపారాలు మునుపటి కంటే పెరిగాయి. లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ వంటి బ్రాండ్ల పేరుతో దుస్తులు అమ్మే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్‌ రిటైల్‌ అమ్మకాలు గతనెల 55 % పెరిగాయి. బాటా కూడా కోవిడ్‌‌‌‌కు ముందుస్థాయిల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. 

కొత్త స్టోర్లపై ఫోకస్...

అక్టోబర్–-డిసెంబర్ లో కోవిడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిజానికి రిస్ట్రిక్షన్లు పెద్దగా లేవు. అందుకే జనం విపరీతంగా షాపులకు వస్తున్నారు. ప్రస్తుతం డిస్కౌంట్లు కూడా పెద్దగా ఇవ్వడం లేదు. దీంతో షాపుల గ్రాస్ మార్జిన్లు కూడా పెరిగాయి.  షాపర్స్ స్టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వేణుగోపాల్ నాయర్ మాట్లాడుతూ,  రాబోయే క్వార్టర్లలో టైర్-2 మార్కెట్లలో భారీగా స్టోర్లను తెరుస్తామని వెల్లడించారు. చిన్న నగరాల్లో ఎదగడానికి  భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈ డిపార్ట్‌‌‌‌మెంటల్ స్టోర్ చైన్ ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 స్టోర్లను తెరుస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మరో 10 స్టోర్‌‌‌‌లకు ప్లాన్ చేస్తోంది. రిలయన్స్ రిటైల్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌‌‌‌మెంట్ హెడ్ గౌరవ్ జైన్   మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ సమయంలో 1,700 స్టోర్లను తెరిచామని, మరిన్ని స్టోర్లు రాబోతున్నాయని వివరించారు.