మంటల్లో పంట..  మొక్కజొన్న చేలల్లో వరుస ప్రమాదాలు 

మంటల్లో పంట..  మొక్కజొన్న చేలల్లో వరుస ప్రమాదాలు 
  • కోత దశలో వెంటాడుతున్న ఘటనలు
  • కరెంటు తీగలతోనే ముప్పు
  • విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు భారీ నష్టం

నిర్మల్, వెలుగు: పంట చేనులపై నుంచి వెళ్లే కరెంట్​తీగలు షార్ట్​సర్క్యూట్​కు గురై మొక్కజొన్న పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. నిర్మల్​జిల్లాలో కొద్ది రోజులుగా మొక్కజొన్న చేనుల్లో వరుసగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలతో పంటలు కాలి బూడిదవుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్​జిల్లా భోరజ్​లో 200 ఎకరాల్లో పంట దగ్ధమైంది. మొక్కజొన్న చేనులపై నుంచి వెళ్లే విద్యుత్ తీగలు ఈదురుగాలులకు ఒకదానికొకటి తాకి నిప్పు రవ్వలు వెదజల్లుతున్నాయి. దీంతో అప్పటికే ఎండిపోయి కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటకు నిప్పుంటుకొని మంటల్లో కాలిపోతోంది. ముఖ్యంగా పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకోవడం, గాలి దుమారం వీస్తుండడంతో తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు కిందపడుతున్నాయి. అవి మక్క పంటకు అంటుకొని మంటలు వ్యాపించి చూస్తుండగానే దహించి 
వేస్తున్నాయి.

 వరుస ఘటనలతో రైతుల్లో ఆందోళన

నిర్మల్​జిల్లా కుభీర్ మండలంలోని పార్డి కే, దార్ కుభీర్ గ్రామాల్లో 30 ఎకరాల్లో జొన్న పంట కాలిబూడిదైంది. భైంసా మండలంలోని వాలేగావ్, హంపోలి, కుంసుర గ్రామాల్లో దాదాపు పది ఎకరాలు, లోకేశ్వరం మండల కేంద్రంతోపాటు రాజురా, బిలోలి, సాత్ గామ్ లో సుమారు 8 ఎకరాలు, నర్సాపూర్(జి) మండల కేంద్రంతోపాటు టెంభరేణి, మోత్కుపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 15 ఎకరాలు, కుంటాల మండలంలోని విట్టాపూర్, లింబాకే, పెంచికల్ పాడ్, కల్లూరు గ్రామాల్లో దాదాపు 25 ఎకరాలు, పెంబితోపాటు  మండలంలోని పోచంపల్లిలో పదెకరాలు, ముథోల్ మండలంలో 11 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట విద్యుత్ ప్రమాదాలతో కాలి బూడిదైంది. 

విద్యుత్ తీగలతోనే ప్రమాదాలు

పంట చేనులపై నుంచి వెళ్లే విద్యుత్ తీగల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. తీగలన్నీ వదులుగా మారి గాలి దుమారానికి ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు వెలువడుతున్నాయి. అవి పంటచేలపై పడడంతో అప్పటికే ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో ఉన్న కారణంగా ఒక్కసారి మంటలు చెలరేగుతున్నాయి. క్షణాల్లో మంటలు చేనంతా వ్యాపించి నిమిషాల్లో పంటను దహించి వేస్తున్నాయి. వేలాడే కరెంట్​తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు రైతులు మండిపడుతున్నారు.

నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం అధికారుల తీరుపై ఫైర్​అయ్యారు. విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమన్నారు.

పది ఎకరాలలో పంట బూడిదైంది

పదెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. ఇందుకు అప్పులు కూడా చేశాను. కొద్ది రోజుల్లో పంటను అమ్ముకొని అప్పులు చెల్లిద్దామనుకున్నా. ఇంతలోనే విద్యుత్ ప్రమాదంతో పంటంతా కాలి బూడిదైంది. చేసిన అప్పులు ఎలా చెల్లించాలో.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం  లేదు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. -  గోస్కుల రాములు, రైతు, పెంబి మండలం

కండ్ల ముందే పంట కాలి పోయింది

కష్టపడి నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాం. కుటుంబమంతా రాత్రింబవళ్లు శ్రమించి పంటను కాపాడుకున్నాం. వారం రోజుల్లో పంటను అమ్ముకునేందుకు సిద్ధమవుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు రూ.3.50 లక్షల పంట నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి. ఓం ప్రకాశ్, రైతు, పార్డి కె, కుభీర్ మండలం