వ్యవసాయ పనులు ఊపందుకునే సమయంలో కూలీల కొరత

వ్యవసాయ పనులు ఊపందుకునే సమయంలో కూలీల కొరత
  • రేట్లు పెంచి ఇస్తామన్నా సమయానికి రావట్లే
  • పక్క జిల్లాల నుంచి రప్పిస్తున్న రైతులు
  • నారు అదను దాటుతుందని ఆందోళన
  • వెదజల్లే పద్దతి బెటర్ అంటున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు: జిల్లాలో వర్షాలు తగ్గి వ్యవసాయ పనులు ఊపందుకునే సమయంలో కూలీల కొరత ఏర్పడుతోంది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరక్క నారు ముదురుతోందని రైతులు టెన్షన్ పడుతున్నారు. గతేడాది వరకు నాటు వేసేందుకు రూ.400 చొప్పున తీసుకున్న కూలీలు, ఇప్పుడు రూ.500 ఇస్తామని అంటున్నా సమయానికి రావడం లేదు. దీంతో కొన్ని గ్రామాల్లో మహిళా రైతులే గ్రూపులుగా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరి పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. ఇంకొంత మంది రేటు ఎక్కువ ఇచ్చి మరీ సరిహద్దు జిల్లాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. అక్కడ నార్లు ఆలస్యంగా పోసి, నాట్లు ఆలస్యం కావడంతో రాను, పోను ఆటో కిరాయి ఇస్తామని ఒప్పించి కూలీలను మాట్లాడుతున్నారు. ఒక్కో ఎకరానికి నాటు వేసేందుకు గతేడాది వరకు రూ.3 వేలు ఉండగా, ఈ సారి రూ.3500 నుంచి రూ.4 వేల వరకు పెరిగింది. దీనికి అదనంగా మరో రూ.600 వరకు ఆటో కిరాయిల భారం రైతులపై పడుతోంది. 

కరివెద పద్దతే బెటర్..

వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు కరివెద విధానాన్ని ఫాలో అయితే బెటరని చెబుతున్నారు. సబ్సిడీ యంత్రాల స్కీమ్ పై నిర్ణయం ప్రభుత్వానిదేనని అంటున్నారు. కూలీలు దొరకని పరిస్థితిలో దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ తో విత్తుకోవడం లేదా ముందుగానే పొడి 
దుక్కులు దున్నుకొని వడ్లను చల్లడం, లేదా నాన బెట్టిన వడ్లను చల్లుకోవడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని అంటున్నారు. వెదజల్లే పద్దతి ద్వారా దాదాపు ఎకరానికి రూ.10 వేల వరకు ఖర్చు తగ్గుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లాలో ప్రతి సీజన్ లో 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో ఈ కరివెద పద్దతిలో రైతులు వరి సాగు చేస్తున్నారని,  దీనిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. 

వరి నాట్లు షురూ..

జిల్లాలో ఈ సీజన్ లో 5.90 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశముంది. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాల కంటే కొంత ముందుగానే వరి నాట్లు వేస్తారు. వరి కోతల సమయంలో యంత్రాలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఇబ్బంది లేకున్నా, ఎక్కువ మంది రైతులు ఒకేసారి నాట్లు వేసేందుకు మాత్రం తగినన్ని వరి నాటు యంత్రాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. గతంలో సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందించేది. నాలుగేళ్ల నుంచి రైతుబంధును ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన స్కీమ్ లను నిలిపేయడంతో నాటు కోసం రైతులు కూలీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్లలో ఒకేసారి ఎక్కువ మంది రైతులు నాటు వేయాల్సి వస్తే, కూలీలకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో రైతులే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి 
వస్తోంది.

సూర్యాపేట జిల్లా నుంచి కూలీలను రప్పిస్తున్నాం

నారు యాతకు వచ్చి నాలుగు రోజులైంది. కూలీల కోసం తిరుగుతుంటే దొరకట్లేదు. ఇవాళ వస్తాం.. రేపొస్తాం అంటూ వాయిదాలు పెడుతున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నుంచి కూలీలను మాట్లాడాం. ఎకరానికి రూ.3500, రాను పోను ఆటో ఖర్చులకు రూ.600 అడుగుతున్నారు. గతేడాది ఇక్కడ ఒక్కో కూలీకి రూ.400 ఇచ్చాం, ఇప్పుడు రూ.500 అడుగుతున్నారు. ఖర్చు పెరుగుతున్నా అదను సమయానికి నాటు వేయాలంటే కూలీల కోసం ఎదురుచూడక తప్పడం లేదు.

-సోమిరెడ్డి, రైతు, గురువాయిగూడెం