రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొరత

రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొరత
  • కొవిడ్​ వార్డుల్లో.. ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొరత
  • స్టేట్​వైడ్ ​అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే పరిస్థితి
  • బయట నుంచి తెచ్చుకోమంటున్న సిబ్బంది
  • ఎంజీఎంలో 800  బెడ్లకు 400 లోపే మీటర్లు
  • బ్లాక్​లో ఒక్కోటి రూ. 10 వేలకు అమ్మకం
  • ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు, డాక్టర్లు

వరంగల్‍రూరల్‍, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‍ వార్డుల్లో కొత్త సమస్య మొదలైంది. కరోనా వైరస్ అటాక్‍ వల్ల ఆక్సిజన్​లెవల్స్​ పడిపోయిన పేషెంట్లు ఎమర్జెన్సీ ట్రీట్‍మెంట్‍ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తీరా వాళ్లకు ఆక్సిజన్ అందించే క్రమంలో ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కు కొరత ఏర్పడుతోంది. రోజురోజుకూ వార్డుల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు తగ్గట్లు ఆక్సిజన్​ఫ్లో మీటర్స్​లేకపోవడంతో పేషెంట్లకు సకాలంలో ప్రాణవాయువు అందక చనిపోతున్నారు. ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యంగానే ఉంది. ఆక్సిజన్ అవసరమైన పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బెడ్లు, ఆక్సిజన్​ రెడీ చేస్తున్నారేగానీ ఆ మేరకు ఆక్సిజన్​ ఫ్లో మీటర్స్​తెప్పించకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటోంది.  దీంతో ఎమర్జెన్సీ పేషెంట్లు వచ్చినప్పుడు డాక్టర్లు, స్టాఫ్​ సింపుల్​గా ఆక్సిజన్​బెడ్స్​లేవని చెబుతున్నారు. ఒకవేళ ‘బెడ్లు ఉన్నాయి కదా?’ అని పేషెంట్ల వెంట వచ్చే అటెండెంట్లు ఎవరైనా అడిగితే ఆక్సిజన్​ ఫ్లో మీటర్లు తెచ్చుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఎంజీఎంలో 400 బెడ్లకే ఫ్లో మీటర్స్​ 
కరోనా పేషెంట్లకు ట్రీట్‍మెంట్‍అంటూ ఏదైనా ఉందంటే అది ఇన్‍టైంలో ఆక్సిజన్​ అందించడమేనని  డాక్టర్లు చెబుతున్నారు. లంగ్స్ లో ఇన్​ఫెక్షన్​ఎక్కువై, ఆక్సిజన్​ సాచ్యురేషన్​ లెవల్స్​94 కంటే తగ్గినవాళ్లకు ప్రాణవాయువు అందించడం కంపల్సరీ. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి పేషెంట్లు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగుతీస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పెద్దదయిన వరంగల్‍ఎంజీఎం హాస్పిటల్​కు ఇలాంటి కేసులే ఎక్కువ వస్తున్నాయి. దీంతో ఈ ఆసుపత్రిలోని 1200 బెడ్లతో కొవిడ్‍ వార్డ్​ఏర్పాటుచేశారు. ఇందులో ఇప్పటికే 800 బెడ్ల ద్వారా ఆక్సిజన్ సర్వీస్‍ ఇస్తున్నామని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.  కానీ 400 బెడ్లకు ఆక్సిజన్​ ఫ్లో మీటర్లే లేవని, అందువల్ల ఆ ఆక్సిజన్​ బెడ్లు ఉండీ లేనట్లేనని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి ఆక్సిజన్​ సిలిండర్​పక్కనే ఉన్నప్పటికీ ఫ్లో మీటర్​ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. బాధితులకు ఆక్సిజన్ ఎంతస్థాయిలో అందించాలో ఈ ఫ్లో మీటర్​లో ఫిక్స్​ చేసి ఇస్తుంటారు. కానీ మీటర్లే లేకపోవడంతో బెడ్లు, ఆక్సిజన్​ ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎమర్జెన్సీ టైంలో వాడాల్సిన ఆక్సిజన్ ఫ్లో మీటర్లను ఎంజీఎంలో పనిచేస్తున్న కొందరు ప్రైవేట్​ఏజెన్సీకి చెందిన సిబ్బంది పెద్దఎత్తున మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం.. ఇన్నాళ్లు వారిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో చోరీకి గురయ్యాయని చెబుతున్నారు. బాధితులకు సేవలందించే క్రమంలో మరికొన్ని పనికిరాకుండా పోయాయి. మొత్తంగా ఎంజీఎంలో ఆక్సిజన్‍ ఫ్లో మీటర్స్ కొరత తీవ్రంగా నెలకొంది. దీంతో బయట తెచ్చుకోవాలని పేషెంట్ల బంధువులకు డాక్టర్లు, స్టాఫ్​ సూచిస్తున్నారు.  

బయట మార్కెట్లో బ్లాక్​ దందా
నిన్నమొన్నటి వరకు బయట కంపెనీని బట్టి రూ.1,200 నుంచి రూ.2,000 వరకు దొరికిన ఆక్సిజన్‍ఫ్లో మీటర్లు ఇప్పుడు రెమ్డిసివిర్‍ ఇంజక్షన్​లాగే ఎక్కడా దొరకడం లేదు. అక్కడో ఇక్కడో దొరికినా బ్లాక్​లో రూ.10 వేల వరకు రేటు చెబుతున్నారు. ఎక్స్​పర్ట్స్​చెబుతున్న దానిప్రకారం క్వాలిటీ ఫ్లో మీటర్స్​అందించే సంస్థలు దేశంలో ఐదులోపే ఉన్నాయి. కరోనా పరిస్థితుల్లో రాష్ట్రాల నుంచి వస్తున్న ఆర్డర్లతో వారు సర్వీస్‍ అందించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా, రాష్ట్ర సర్కార్‍ఈ విషయంలో సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినపడుతున్నాయి. అన్ని దవాఖానాల్లో ప్రస్తుతం ఆక్సిజన్​ స్టాక్​కు ప్రాబ్లమ్​లేకున్నా అవసరమైన ఆక్సిజన్​ ఫ్లో మీటర్స్​ తెప్పించడంలో ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఒక్క వరంగల్‍ ఎంజీఎంలోనే ఇప్పుడున్న బెడ్లకు ఇంకా 400 మీటర్లు అవసరమున్నాయి. దీంతో ఇక్కడి ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి ఇండెంట్​ పెట్టాయి. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్​లో ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు దృష్టికి ఆఫీసర్లు తెచ్చారు. దీంతో ఆయన అమెరికా ‘ఆటా’ సంస్థ హెల్ప్​ అడిగారు. కాగా, సమస్య రాష్ట్రమంతా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆక్సిజన్​ఫ్లో మీటర్లు తెప్పించాలని డాక్టర్లు కోరుతున్నారు.