మాఫియా చేతిలో 7 బుల్లెట్లు.. ఇప్పుడాయనే ‘సివిల్స్’ అధికారి !!

మాఫియా చేతిలో 7 బుల్లెట్లు..  ఇప్పుడాయనే ‘సివిల్స్’ అధికారి !!

ఈసారి సివిల్స్ ఫలితాల్లో ఒక అభ్యర్థి ప్రత్యేకం.. ఆయన సాధించిన ర్యాంకు ప్రత్యేకం !! పేదరికాన్ని మించిన నేపథ్యం ఆ అభ్యర్థి సొంతం !! నీతి నిజాయితీ కోసం మాఫియా మూకల తుపాకీ గుండ్లకు సైతం ఎదురొడ్డి నిలబడిన సాహసం ఆయన సొంతం !! అది మరెవరో కాదు.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ పట్టణానికి చెందిన రింకూ రాహీ. ఈసారి యూపీఎస్సీ సివిల్స్ లో 683వ ర్యాంకర్. 40 ఏళ్ల రింకూ గురించి తెలుసుకోవాలంటే 15 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. 2007లోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (పీసీఎస్) పరీక్షలో రింకూ ఎంపికయ్యారు. ఆయన శిక్షణ పూర్తి చేసుకొని 2008లో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో సాంఘిక సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. నిజాయతీపరుడైన రింకూ తన పరిధిలోని అవినీతి అధికారులను సహించేవారు కాదు. 2008 చివర్లో ఆయన  రూ.100 కోట్ల స్కాలర్షిప్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు. మాయావతి ప్రభుత్వ హయాంలో 2009 మార్చి 26న .. స్కాలర్షిప్ మాఫియాను నడుపుతున్న కొంత మంది ఆయనపై కాల్పులు జరిపించారు. ఆరు బుల్లెట్లు రింకూ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఒక బుల్లెట్ కంట్లోకి చొచ్చుకుపోయింది. ఇక ఆ కన్ను పోయినట్టేనని వైద్యులు తేల్చి చెప్పారు.

కాల్పుల తర్వాత..

‘‘ కాల్పులు జరిగిన  తర్వాత దాదాపు నాలుగు నెలల పాటు నేను ఆస్పత్రిలో చికిత్స పొందాను. నేను అప్పుడు పెట్టుకున్న మెడికల్ లీవ్  దరఖాస్తులు నేటిదాకా పెండింగ్ లోనే ఉన్నాయి’’ అని రింకూ రాహీ చెప్పుకొచ్చారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన నలుగురికి చెరో పదేళ్ల జైలు శిక్ష పడింది. తగిన ఆధారాలు లేకపోవడంతో మరో నలుగురిని నిర్దోషులుగా పరిగణించి విడుదల చేశారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వచ్చి విధుల్లో చేరిన తర్వాత కూడా నాపై కక్ష సాధింపు ఆగలేదు. నా బదిలీలు ఆగలేదు. మాయావతి గద్దె దిగిన తర్వాత ఏర్పడిన అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ సర్కారు కూడా నా నిజాయితీని భరించలేకపోయింది. అవినీతిపై అదేపనిగా మాట్లాడుతున్నాననే అక్కసుతో సమాజ్ వాదీ సర్కారు నన్ను ఒకానొక దశలో సైకియాట్రిక్ వార్డులో కూడా చేర్పించింది’’ అని నాటి చేదు జ్ఞాపకాలను రింకూ నెమరువేసుకున్నారు. కొన్ని ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్షల్లో వయోపరిమితికి సంబంధించిన మినహాయింపు ఉంటుంది. దీన్ని వినియోగించుకున్న రింకూ రాహీ 40 ఏళ్ల వయసులోనూ బాగా కష్టపడి చదివి  683వ ర్యాంకును సాధించారు. 

మరిన్ని వార్తలు..

కేకే మరణవార్త విని గుండె ముక్కలైంది

తల్లి ఫొటో చూసి మురిసిపోయిన మోడీ