
బోధన్, వెలుగు: నిజామాబాద్జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో నేడు నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షకీల్ కోరారు. ఆదివారం బోధన్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ టౌన్, రూరల్ గ్రామాల నుంచి ప్రజలను అధిక సంఖ్యలో తరలించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వి.ఆర్ దేశాయ్, మండల ప్రెసిడెంట్ నర్సన్న, కార్యదర్శి సిర్పా సుదర్శన్, డీసీసీబీ డైరెక్టర్గిర్దావర్ గంగారెడ్డి, రైతు బంధు మాజీ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఆరేళ్లలో 64 లక్షల టన్నుల గోదాంలు నిర్మించాం
భీంగల్, వెలుగు: ఆరేళ్లలో 64 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్ణయించామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ చెప్పారు. మండల౦లోని సికింద్రాపూర్‌లో నిర్మాణ దశలో ఉన్న గోదాంలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు ఉంటే తెలంగాణ వచ్చాక 64 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించామని చెప్పారు. వీటి వల్ల ఏడు నెలల కాలంలో ఏడున్నర కోట్ల ఆదాయం వచ్చిందని, స్థానికులు, హమాలీలకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్ట్ మేనేజర్ సాయి, మండల అధికారులు ఉన్నారు.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు సరికాదు
మాక్లూర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను బూచిగా చూపుతూ రాష్ట్రంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఆరోపించారు. ఆదివారం మాక్లూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ఆపాలని చూస్తుందని ఆరోపించారు. నేడు నిజామాబాద్‌లో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ పురుషోత్తంరావు, శ్యామ్‌రావు, అంజయ్య, శేఖర్‌రావు పాల్గొన్నారు.
బెస్ట్ టీచర్‌గా డెయిరీ కాలేజీ డీన్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి డెయిరీ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ శరత్‌చంద్ర స్టేట్ లెవల్‌లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. వెటర్నరీ డాక్టర్‌గా, రాజేంద్ర నగర్ వెటర్నరీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఆయా చోట్ల వివిధ హోదాల్లో పని చేసిన శరత్‌చంద్ర ప్రస్తుతం కామారెడ్డి డెయిరీ కాలేజీ డీన్‌గా పని చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడంపై కాలేజీ ప్రొఫెసర్లు అభినందించారు.
వివాహిత ఆత్మహత్య
లింగంపేట, వెలుగు: మండలంలోని మాలోత్తండాకు చెందిన ఓ వివాహిత శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి తండాకు చెందిన రోజా (28)కు పర్మల్ల తండాకు చెందిన మాలోత్ రాజుతో 2013లో పెళ్లి అయ్యింది. తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలికి రుత్విక్ (5) కుమారుడు ఉన్నాడు. మృతురాలి తమ్ముడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
బీడీ కార్మికులకు జీవన భృతి ఎప్పుడిస్తరు
బోధన్, వెలుగు: సీఎం కేసీఆర్ 2018లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారంగా బీడీకార్మికులకు రూ.2016 జీవన భృతి ఎప్పుడు ఇస్తారని బీడీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం బోధన్ టౌన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మల్లేశ్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనభృతి కోసం ఉన్న నిబంధన 2014 కటాఫ్ డేట్‌ను తొలగించి ఫీఎఫ్ కట్ అవుతున్న ప్రతి కార్మికులురాలికి జీవనభృతి ఇస్తామని కేసీఆర్ హామీని ఇచ్చారన్నారు. నేడు జిల్లాకు వస్తున్న సీఎం బీడీకార్మికుల సమస్యపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. సీయం సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిస్తున్న లీడర్లు.. మరో పక్క మూడు జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని అడ్టుకుంటే ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించినట్లే అన్నారు. ప్రెస్మీట్లో ముత్తవ్వ, లక్ష్మి, రాంబాయి, సవిత, రహీమా, పోశవ్వ, రెహనాబేగం పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల్లో మనమే ఫస్ట్
కామారెడ్డి , వెలుగు: డెవలప్‌మెంట్, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని ఉర్దూ ఆకాడమీ చైర్మన్, కామారెడ్డి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎం.కె ముజీబుద్దీన్ చెప్పారు. ఆదివారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా పర్యటనలో బీర్కుర్‌లో రేషన్ షాపునకు వెళ్లిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్ గవర్నమెంట్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి కావాలనే అనవసర రాద్దాంతం చేశారన్నారు. పార్టీ పరంగా ప్రోగ్రామ్‌లకు వచ్చి ఆకస్మిక తనిఖీ అని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, లీడర్లు వేణుగోపాల్‌రావు, పిప్పిరి ఆంజనేయులు, గాల్‌రెడ్డి, బల్వంత్‌రావు, దశరథ్‌రెడ్డి, నల్లవెల్లి ఆశోక్, మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
అక్రమ అరెస్ట్ సరికాదు
భీంగల్, వెలుగు: మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త లింగంను విచారణ పేరుతో శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదని బీజేపీ స్టేట్ లీడర్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులతో కలిసి భీంగల్ పీఎస్ ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అరెస్టు చేసిన లింగంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి , వెలుగు: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదివారం కామారెడ్డి టౌన్ పీఎస్‌లో కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదు చేశారు. షబ్బీర్‌అలీ కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ప్రెసిడెంట్ పండ్ల రాజు, యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కైనల్వర్ అన్వర్ అహ్మద్, లీడర్లు దాత్రిక సత్యం, గొనే శ్రీనివాస్, లక్కపత్ని గంగాధర్, ముకుందం పాల్గొన్నారు.