ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలె : బొంతు రామ్మోహన్

ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలె : బొంతు రామ్మోహన్

హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్ లో అరెస్టయిన టీఆర్ఎస్ నాయకులను మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ పరామర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫోన్లు చేయించి.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరించారు. బండి సంజయ్, అరవింద్ వెంటనే తెలంగాణ సమాజానికి, ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్  ఇంటి దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్స్ 148, 452, 354, 323, r/w 149 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ వీడియో ఆధారంగా 12 మందిని గుర్తించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పని మనిషిపై కూడా దాడి చేసినట్లు విజయలక్ష్మీ పోలీసులకు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించి వివరాలు పోలీసులకు అందించారు.  దాడి చేసిన నిందితులను శిక్షించాలని పోలీసులను కోరారు.