TSPSCని రద్దు చేసి.. విచారించాలె : రేవంత్ రెడ్డి

TSPSCని రద్దు చేసి.. విచారించాలె : రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి, విచారించాలని కోరారు. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సైను కలిసిన ఆయన.. పేపర్ లీక్ లో జరిగిన అవతవకలపై ఫిర్యాదు చేశారు. పేపర్ ను దొంగిలించి  కోట్లకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ దగ్గర ఉన్న వారిపైనా ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ను, బోర్డు ఛైర్మన్ ను విచారించేందుకు అనుమతి కోరినట్టు తెలిపారు. గవర్నర్ కు విశేష అధికారాలున్నాయని, వాటి ప్రకారం ఇప్పుడున్న బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్ చేసే అధికారం ఉందని చెప్పారు. 

పేపర్ లీక్ ఘటనకు ఐటీ శాఖే కారణమని, మంత్రి కేటీఆర్ పరిధిలో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమకు సిట్ పై నమ్మకంపై లేదని, పారదర్శక విచారణపై గవర్నర్ ను అనుమతి కోరామని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్ ను కోట్లకు అమ్ముకున్నారని, 317 ప్రకారం గవర్నర్ బోర్డు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉందన్నారు. ఇది లక్షలాది విద్యార్థులు కాదు.. లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య అని చెప్పారు. ఈ విషయంపై తమకు గవర్నర్ హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫైనల్ గా మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని కోరారు.