మన జెనిరిక్స్‌‌ చూపు చైనా వైపు

మన జెనిరిక్స్‌‌ చూపు చైనా వైపు
  • అక్కడి ఔషధ మార్కెట్​ 10 లక్షల కోట్లు

రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో తన వ్యాపారాన్ని చైనాలో భారీగా పెంచుకునేందుకు అనువైన భాగస్వామి కోసం సన్‌‌ ఫార్మా వెతుకుతోంది. చైనా మార్కెట్లో గణనీయమైన ఆదాయం సంపాదించాలని కంపెనీ టార్గెట్‌‌గా పెట్టుకున్నట్లు దిలీప్‌‌ సంఘ్వి వెల్లడించారు. చైనా మార్కెట్‌‌ కలలు కంటున్నది ఈ ఒక్క కంపెనీనే కాదు…..మన హైదరాబాద్‌‌ కంపెనీలు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మాలు సైతం చైనా మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ కంపెనీలు ఇప్పటికే చైనా మార్కెట్లో ప్రవేశించాయి.

యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అనుమతించిన ఔషధాలను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఫార్మా కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అంతేకాదు, ఔషధాల కొనుగోలుకు  చైనాలోని 11 రాష్ట్రాలు కలిసి ప్రత్యేక  గ్రూప్‌‌ సంస్థలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా జెనిరిక్స్‌‌ను తక్కువ ధరలకే ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి. ఐక్యూవీఐఏ అంచనాల ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలలో  చైనా ఔషధ మార్కెట్‌‌ ఏటా 5.5 శాతం పెరిగి 2022 నాటికి  రూ. 10 లక్షల కోట్ల (156 బిలియన్ డాలర్ల)కు చేరనుంది.

అమెరికాలో తగ్గిన మార్జిన్లు…..

తక్కువ ధరలకే జెనిరిక్స్‌‌ను సరఫరా చేసేందుకు ఒకరితో ఒకరు పోటీపడటంతో అమెరికా మార్కెట్లో ఇండియా కంపెనీల మార్జిన్లు పడిపోయాయి. దాంతో దేశీయ మార్కెట్‌‌తోపాటు, ఇతర కొత్త మార్కెట్ల వేటలో పడ్డాయి మన ఫార్మా కంపెనీలు. ఈ నేపథ్యంలో సహజంగానే చైనా ఒక ముఖ్య మార్కెట్‌‌గా అవతరించింది. యూఎస్‌‌ఎఫ్‌‌డీఏ నుంచి అత్యధిక సంఖ్యలో అనుమతులు పొందిన ఇండియా కంపెనీలకు చైనా మార్కెట్‌‌ ఒక వరంగా పరిణమించింది. 2017లో దాఖలైన ఏఎన్‌‌డీఏలలో ఇండియా కంపెనీల వాటా 38 శాతమని ఐక్యూవీఐఏ రిపోర్టు చెబుతోంది.

సంస్కరణల బాటలో చైనా….

చైనా ప్రభుత్వం సంస్కరణలకు ఊపు ఇస్తోంది. ఔషధ కంపెనీలకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా చొరవ తీసుకుంటోందని ఎడిల్‌‌వీస్‌‌ ఎనలిస్టు దీపక్ మాలిక్‌‌ చెప్పారు. కొత్త ఔషధాలకు అనుమతులు ఇవ్వడంలో చైనాలో తీవ్రమైన జాప్యం జరిగేదని, ఇప్పుడు దానిని గణనీయంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కొత్త మాలిక్యూల్స్‌‌ను రిజిస్టర్‌‌ చేసేందుకు  చైనాలోని ఎఫ్‌‌డీఏ కనీసం ఏడెనిమిదేళ్లు టైం తీసుకునేదని పేర్కొన్నారు. దీంతో పరిస్థితులలో మార్పు తెచ్చేందుకు అక్కడి ఎఫ్‌‌డీఏకి కొత్త అధికారిని చైనా ప్రభుత్వం నియమించిందని చెప్పారు.

క్లోపిడోగ్రెల్‌‌ మార్కెట్ రూ.11,157 కోట్లు…

గుండె సంబంధ వ్యాధుల చికిత్సకు వాడే క్లోపిడోగ్రెల్‌‌ ఔషధానికి డాక్టర్‌‌ రెడ్డీస్‌‌కు చైనాలో అనుమతి దొరికింది. చైనాలో ఈ ఔషధ మార్కెట్‌‌ విలువ 1.6 బిలియన్‌‌ డాలర్లని ఎడిల్‌‌వీస్ రిపోర్టు పేర్కొంది. అమెరికాలో అమ్ముతున్న ఔషధాల పోర్ట్‌‌ఫోలియోలో 70 ఔషధాలను చైనా మార్కెట్‌‌ కోసం గుర్తించినట్లు ఎనలిస్టుల కాల్‌‌ సందర్భంగా డాక్డర్ రెడ్డీస్‌‌ ప్రతినిధులు వెల్లడించారు. ఔషధాల అనుమతికి పట్టే కాలం ఏడాదిన్నర నుంచి రెండేళ్లనుకుంటే, డాక్టర్ రెడ్డీస్‌‌పై చైనా మార్కెట్‌‌ ప్రభావం 2022 ఆర్థిక సంవత్సరం  నాటికి తెలుస్తుందని క్రెడిట్‌‌ సూయైజ్‌‌ ఎనలిస్టు అనుభవ్‌‌ అగర్వాల్‌‌ అభిప్రాయపడ్డారు. చైనా మార్కెట్‌‌ను నిర్లక్ష్యం చేయలేమని లుపిన్‌‌ కూడా ప్రకటించింది. జెనిరిక్స్‌‌ లేదా స్పెషాలిటీ ప్రొడక్ట్స్‌‌ను చైనాలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు లుపిన్‌‌ వెల్లడించింది.  చైనాలో ఏ ప్రొడక్ట్స్‌‌ను రిజిస్టర్‌‌ చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మరో కంపెనీ అలెంబిక్‌‌   తెలిపింది. యూఎస్‌‌, యూరప్‌‌లతోపాటు చైనాలోనూ ఔషధాలు అమ్మాలని నాట్కో ఫార్మా భావిస్తోంది. అరబిందో ఫార్మా ఫోర్ట్‌‌ఫోలియోకు చైనాలో మెరుగైన అవకాశాలుంటాయని సీఐఎంబీ ఫార్మా ఎనలిస్టు జతిన్‌‌ కొటియన్‌‌ చెప్పారు. చైనాలో ఇప్పటికే ప్లాంట్‌‌ నిర్మాణాన్ని కూడా అరబిందో చేపట్టిందన్నారు. ఇన్‌‌హేలర్స్‌‌ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక జాయింట్‌‌ వెంచర్‌‌ను అరబిందో ఏర్పాటు చేసిందని చెప్పారు.