ప్రశ్నిస్తే షోకాజ్.. నిలదీస్తే సస్పెన్షన్‌‌‌‌

ప్రశ్నిస్తే షోకాజ్.. నిలదీస్తే సస్పెన్షన్‌‌‌‌
  • చిన్నచిన్న కారణాలతో  ఆఫీసర్ల చర్యలు
  • ఇప్పటికి 170 మందిపై  సస్పెన్షన్​వేటు
  •  న్యాయం కోసం ట్రిబ్యునల్​కు గ్రామ ప్రథమ పౌరులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కొత్త పంచాయతీరాజ్​ చట్టంతో రాష్ట్రంలోని సర్పంచులు పూర్తిగా వాక్​ స్వాతంత్ర్యం కోల్పోయారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన గ్రామ ప్రథమ పౌరులను ఆఫీసర్లు తమ కింది సబ్​ఆర్డినేటర్ల కంటే హీనంగా చూస్తున్నారు. అప్పులు చేసైనా సరే, చెప్పిన టైంకు చెప్పిన వర్క్​కంప్లీట్​ చేయాలని ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఎదురయ్యే సమస్యలను, తమకు జరిగిన నష్టాన్ని, గ్రామాభివృద్ధి విషయంలో జరుగుతున్న  లోపాలను కూడా చెప్పుకోలేని పరిస్థితికి సర్పంచులు వచ్చారు. అప్పుల బాధతోనో, ఆవేదనతోనో ఇదేంటని ప్రశ్నిస్తే షోకాజ్, నిలదీస్తే సస్పెన్షన్‌‌‌‌ అన్నట్లుగా చిన్నచిన్న కారణాలకే సర్పంచ్​లపై యాక్షన్​ తీసుకుంటున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే రాష్ట్రంలో 170 మందికి పైగా సర్పంచులను సస్పెండ్‌‌‌‌ చేశారు. షోకాజ్‌‌‌‌ నోటీసులు అందుకున్న వాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. తమపై ఈ తరహా ఆఫీసర్ల వేధింపులను ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు.
పర్సనల్‌‌‌‌గా తీసుకుంటున్న ఆఫీసర్లు
గతంలో గ్రామ సర్పంచులు గ్రామాభివృద్ధి విషయంలో గవర్నమెంట్‌‌‌‌ ఆఫీసర్లను ప్రశ్నించేవాళ్లు. తమ ఊరికి వస్తే సమస్యలను చూపిస్తూ నిలదీసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్​రివర్స్​అయింది. ఎవరైనా ఆఫీసర్‌‌‌‌ను ప్రశ్నించాలంటే సర్పంచ్‌‌‌‌కు సాధ్యపడడం లేదు. ‘మీ ఊరిలో ఎక్కడికి పోయినా చెత్త కనిపిస్తుంది ఏంటీ..? చెట్లు పెరగలేదు ఎందుకు? శ్మశాన వాటిక, డంపింగ్‌‌‌‌ యార్డు పనులు ఇంకా పెండింగ్‌‌‌‌ ఎందుకున్నాయి?’ అంటూ ఆఫీసర్లే ఉల్టా సర్పంచ్‌‌‌‌లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తమకు సర్కారు నుంచి ఫండ్స్​రావట్లేదనో, ఇప్పటికే లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పెట్టామనో సర్పంచులు అంటే చాలు, ఆఫీసర్లు కొత్త పంచాయతీరాజ్​చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లా కలెక్టర్లు అయితే  తమను అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని, సర్కారు తీరును ప్రశ్నించినా, పర్సనల్​గా తీసుకొని తమపై కక్ష సాధిస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు.
నోరుమూసుకొని ఉండాల్సిందే.. 
గ్రామాల్లో  రెవెన్యూ శాఖ చూపించిన  స్థలాల్లోనే  డంపింగ్​యార్డులు, శ్మశానవాటికలు, విలేజ్​పార్కులు కట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో పేదలకు గత ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్​ల్యాండ్స్, ఇతర  వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు సర్పంచులు సహజంగా వెనుకడుగు వేశారు. ముంపు ఏరియాల్లో, పనికిరానిచోట్ల కట్టేందుకు అబ్జెక్షన్​చెప్పారు. ఇది కూడా ఆఫీసర్లకు తప్పుగానే కనిపించి కొంతమంది సర్పంచులపై యాక్షన్​ తీసుకున్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను  గ్రామసభల్లో సర్పంచులు ప్రస్తావించడాన్ని కూడా ఇటీవల ఆఫీసర్లు సీరియస్​గా తీసుకుంటున్నారు. వడ్ల కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, అకౌంట్లలో డబ్బులు పడలేదని, ఈజీఎస్‌‌‌‌ పనులు జరగట్లేదని, చెత్త ఎత్తడం లేదని, డ్రైనేజీలు క్లీన్​చేయడం లేదని.. ఇలా అన్ని సమస్యలనూ సర్పంచ్‌‌‌‌కు గ్రామస్థులు చెప్పుకుంటారు. కానీ గ్రామ సర్పంచులు ఆయా సమస్యలపై ఆఫీసర్లను ఏమీ అడగలేకపోతున్నారు. కనీసం గ్రామ సమస్యలపై  పంచాయతీ సెక్రటరీని ఆదేశించలేకపోతున్నారు. ఎంపీవో, ఎంపీడీవో, డీపీవో, జడ్పీ సీఈవో, డీఆర్‌‌‌‌డీవో వంటి ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చినా నోరుమూసుకొని ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏదైనా సమస్యను దృష్టికి తెస్తే ప్రజల మధ్య ఈ సర్పంచ్‌‌‌‌ తమను ప్రశ్నించారని ఎక్కడ షోకాజ్‌‌‌‌ నోటీస్‌‌‌‌లు పంపిస్తారోనని జంకుతున్నారు. 
న్యాయం కోసం ట్రిబ్యునల్స్​కు.. 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఇప్పటివరకు 170 మందికి పైగా సర్పంచులను ఆఫీసర్లు సస్పెండ్‌‌‌‌ చేశారు. దీంతో చాలామంది న్యాయం కోసం ట్రిబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించారు. కొందరు కోర్టుల్లో కేసులు వేసి వెయిట్‌‌‌‌ చేస్తున్నారు. కొందరు గడువు పూర్తయి తిరిగి బాధ్యతలు చేపట్టారు. గతంలో ప్రభుత్వ నిధులను కాజేస్తేనో, ఇతరత్రా అక్రమాలకు పాల్పడితేనో సస్పెన్షన్‌‌‌‌ వేటు వేసేవారు. కానీ ఇప్పుడు తమ తప్పేమీ లేకున్నా ఆఫీసర్లు బలి చేస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు.  ప్రజలను ఎన్నుకున్న సర్పంచులను  చిన్నచిన్న కారణాలతో సస్పెండ్‌‌‌‌ చేస్తున్నారని, ఇది అన్యాయమని సర్పంచుల ఫోరం నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే ఇలా చేస్తుంటే  గ్రామంలో తమకు ఎవరు విలువ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.


భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ సర్పంచ్‌‌‌‌ దోమ రాహుల్‌‌‌‌ రెడ్డి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల బిల్లులు రావట్లేదని వాట్సప్‌‌‌‌లో ఆడియో వాయిస్‌‌‌‌ రికార్డు  చేసి షేర్​ చేశారు. శ్మశానవాటిక, డంపింగ్‌‌‌‌ యార్డు, పల్లె ప్రకృతి వనాల సందర్శనకు వచ్చిన గవర్నమెంట్‌‌‌‌ ఆఫీసర్లు ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారే తప్ప తనకు పెండింగ్‌‌‌‌ బిల్లులు ఇప్పించడం లేదని, దీనివల్ల  రూ.15 లక్షలకు పైగా అప్పులయ్యాయని, బిల్లులు రాకపోతే ఆత్మహత్యే శరణ్యం అని మాట్లాడారు. దీనిని సీరియస్​గా తీసుకున్న ఆఫీసర్లు సర్పంచ్‌‌‌‌ పంచాయతీరాజ్‌‌‌‌ చట్టాన్ని అతిక్రమించారని పేర్కొంటూ 6 నెలలపాటు  సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఈ నెల 13న ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు.


వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక సర్పంచ్‌‌‌‌ అబ్బు ప్రకాశ్‌‌‌‌ రెడ్డి  గ్రామానికి మంజూరైన రూ.2 కోట్ల సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ నిర్మాణానికి స్థలం కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని జులై 1న పల్లె ప్రగతి గ్రామసభ వేదికను బహిష్కరించారు. గ్రామసభలో ప్రజలతో కలిసి కూర్చున్నారు. ఈ విషయం కలెక్టర్‌‌‌‌ నోటీస్‌‌‌‌కు వెళ్లడంతో 2 రోజుల్లోనే సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ నిర్మాణం కోసం గవర్నమెంట్‌‌‌‌ స్థలాన్ని కేటాయిస్తూ ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు. ఇంతటితో ఆ విషయాన్ని వదిలేయాల్సిన కలెక్టర్‌‌, ఇష్యూను పర్సనల్‌‌‌‌గా తీసుకున్నారు. సర్పంచ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ రెడ్డిపై విచారణ జరిపి పంచాయతీరాజ్‌‌‌‌ చట్టం రూల్స్‌‌‌‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొంటూ 6 నెలల పాటు సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఈ నెల 15న  ఆర్డర్స్‌‌‌‌ పంపించారు.
నన్ను అకారణంగా సస్పెండ్‌‌‌‌ చేశారు
నేను మా గ్రామాన్ని అన్ని విధాలా అభి వృద్ధి చేశాను. ప్రభు త్వ ఆదేశాల ప్రకా రం అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టా ను. సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ స్థలం కేటాయించకపోవడం వల్ల గ్రామానికి మంజూరైన రూ.2 కోట్ల నిధులు వెనక్కి పోతున్నాయని జిల్లా కలెక్టర్‌‌‌‌ను ప్రశ్నిస్తే ఇది మనసులో పెట్టుకొని నన్ను 6 నెలల పాటు సస్పెండ్‌‌‌‌ చేశారు. గవర్నమెంట్‌‌ నిధులు కాజేస్తే ఎంక్వైరీ చేసి తీసేయాలి కానీ ఇలా గవర్నమెంట్‌‌‌‌ ‌‌ ఆఫీసర్లు పర్సనల్‌‌‌‌గా తీసుకొని పనిష్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వడం చాలా బాధాకరం.
‒ అబ్బు ప్రకాశ్‌‌‌‌ రెడ్డి, పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌ జిల్లా
నా బాధ చెప్పుకుంటే సస్పెండ్‌‌‌‌ చేయడమేంటి?
నేను మా గ్రామంలో అప్పులు చేసి అభి వృద్ధి పనులు పూర్తి చేశాను. బిల్లులేమో ఇయ్యడం లేదు. అదే విషయాన్ని అందరికీ చెబితే ఆఫీసర్లు నన్ను సస్పెండ్‌‌‌‌ చేశారు. నేను ప్రభుత్వం అప్ప జెప్పిన పనులు చేయలేదా? లేక ప్రభుత్వ సొమ్ములు ఏమైనా కాజేశానా? ఇదేం పద్ధతో నాకు తెలియడం లేదు.
                                                                                                                                                 ‒ రాహుల్‌‌‌‌ రెడ్డి, రేగులగూడెం గ్రామ సర్పంచ్‌‌‌‌, భూపాలపల్లి జిల్లా