పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 20 నుంచి సేవలు

పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 20 నుంచి సేవలు
  •     తొలగిన న్యాయపరమైన చిక్కులు

సంగారెడ్డి/పటాన్​చెరు, వెలుగు: ఎట్టకేలకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటుకానుంది. గత రెండున్నర ఏళ్లుగా హైకోర్టులో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఈ నెల 20 నుంచి పటాన్ చెరు పాత తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు  ఏర్పాటు చేయాలని ప్రభుత్వ స్పెషల్ సీఎస్ తోపాటు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇన్​స్పెక్టర్ జనరల్ కు హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ అధికారులు శాశ్వత ఆఫీసు ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి గవర్నమెంట్ కు ప్రతిపాదనలు పంపించారు. అనుమతి ఇచ్చి పర్మనెంట్ బిల్డింగ్ పూర్తయ్యే వరకు పటాన్ చెరు లోని పాత తహసీల్దార్ ఆఫీస్ లో సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసును  నిర్వహించనున్నారు.

2018 నుంచే..

పటాన్ చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ సేవలు అందించాలని 2018 నుంచే స్థానిక పొలిటికల్ లీడర్లు దశలవారీగా సమష్టి పోరాటాలు చేస్తూ వచ్చారు. 2023లో పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తోపాటు సంగారెడ్డిలోని ఉమ్మడి మెదక్ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 30ని జారీ చేసింది. ఉమ్మడి రిజిస్ట్రార్ ఆఫీసును సంగారెడ్డి నుంచి పటాన్ చెరుకు తరలించడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో పటాన్ చెరులో ఆఫీసు ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఉమ్మడి జిల్లా ఆఫీస్ సంగారెడ్డిలో కొనసాగడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్న వాదన వినిపించారు. అనంతరం న్యాయస్థానం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సాధించుకున్నాం..

పటాన్ చెరుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు కావడం సంతోషదాయకం. 2018 నుంచే పటాన్ చెరుకు రిజిస్ట్రేషన్ ఆఫీసు రావాలని అనేక పోరాటాలు చేశా. హైకోర్టులో న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు పటాన్ చెరుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును సాధించుకున్నాం. పాత తహసీల్దారు ఆఫీసులో ప్రస్తుతానికి  కార్యకలాపాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పర్మినెంట్ బిల్డింగ్ కోసం 5 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభిస్తాం.
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి