
శ్రీరామ నవమి పండుగ వేళ.. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఆదివారం నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రామయ్య శోభాయాత్రలో కొందరు ముస్లిం యువకులు వాటర్ బాటిళ్లు పంచి.. వేసవి తాపం తీర్చారు. వాళ్లు అందించిన వాటర్ బాటిళ్లను ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లు తీసుకుని.. థ్యాంక్స్ చెప్పారు.
Showcasing communal harmony, Muslim youths offer water bottles in Ram Navami procession in Siliguri
— ANI Digital (@ani_digital) April 11, 2022
Read @ANI Story | https://t.co/IXSRcU1QFy#RamNavami #CommunalHarmony #Siliguri pic.twitter.com/AripjDg358
మతాలు వేరైనా తామందరి మధ్య ఉండే ప్రేమాభిమానాలను చాటాలన్న ఉద్దేశంతోనే వాటర్ బాటిళ్లు పంచాలని నిర్ణయించామని ముస్లిం యువకుల్లో ఓ వాలంటీర్ అయిన షానెవాజ్ హుస్సేన్ చెప్పాడు. శ్రీరామ నవమి శోభాయాత్రలో సుమారు 4 వేలకు పైగా వాటర్ బాటిళ్లను తాము పంపిణీ చేశామని తెలిపారు. నవమి రోజున చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా శోభాయాత్రలో పాల్గొంటారని, వారు ఇబ్బందిపడకూడదని తాము చిన్నపాటి క్యాంపును ఏర్పాటు చేసి సాయం చేశామని హుస్సేన్ చెప్పాడు. దేశంలో ప్రజలంతా పరస్పరం సామరస్యంతో, ఐక్యంగా జీవించాలని మన రాజ్యాంగం చెబుతోందని, దాని స్ఫూర్తితో కొంత మంది యువకులం కలిసి ఈ క్యాంపును నిర్వహించామని అన్నాడు. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, మనమంతా అన్ని పండుగలనూ కలిసి చేసుకుంటామని, ఇప్పుడు శ్రీరామ నవమి పండుగ సంబురాల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హుస్సేన్ తెలిపాడు. పైగా రంజాన్ మాసంలో ఇలా సామరస్యాన్ని చాటేలా పండుగ చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నాడు.
మతాలు వేరైనా, ఒక్కటిగా కలిసి బతకాలని, అన్ని మతాల మధ్య ఐక్యతతో ముందుకు సాగినప్పుడే భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మరో యువకుడు సద్దాం ఖురేషి అన్నాడు. నవమి శోభాయాత్రలో ముస్లిం యువకులు పాల్గొని శుభాకాంక్షలు తెలపడం, వాటర్ బాటిళ్లు అందించడం చాలా సంతోషంగా ఉందని పంకజ్ కుమార్ ఝా అనే యువకుడు చెప్పారు. మండటెండలో వారు స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలిపామన్నాడు.