
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కూటమి షాకిచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను బీజేపీ సాధించలేకపోయింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2024, జూన్ 8వ తేదీ శనివారం మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. వీఐపీ సంస్కృతికి దూరంగా ఉండాలని.. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ప్రజల్లో ఉంటూ.. వారికి అండగా ఉండాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు స్థాయిలలో ఉన్న వారితో సన్నిహితంగా ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
మన కార్యకలాపాలు ఏవీ వీఐపీ సంస్కృతిని ప్రదర్శించకుండా.. మంత్రులతో సహా ప్రజాప్రతినిధులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వ ప్రాథమిక దృష్టి ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేశారు. ప్రజలతో చురుగ్గా మమేకం కావాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, పాలనా యంత్రాంగంతో కలిసి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రులకు సూచించారు.
కాగా, ఉత్తర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు బీజేపీ కేవలం 38 సీట్లు మాత్రమే గెలిచి నిరాశపర్చింది.