ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు వెంటనే చేపట్టాలె

ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు వెంటనే చేపట్టాలె

ఎస్‌‌ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 2 నెలలు దాటగా, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 40 రోజులవుతోంది. ఇప్పటివరకూ రిజల్ట్స్​ ప్రకటించలేదు. 8 లక్షల మంది  అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌‌‌‌ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 2 నెలలు దాటగా, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 40 రోజులవుతోంది. ఇప్పటివరకూ రిజల్ట్స్ ప్రకటించలేదు. దీంతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకే ఇన్ని రోజులు పడితే, ఈవెంట్ల నిర్వహణ, ఆ తర్వాత మెయిన్స్‌‌‌‌ ఎగ్జామ్, ఫలితాల ప్రకటనకు ఇంకెన్ని నెలలు పడుతుందని పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రక్రియను జనరల్ ఎలక్షన్ల వరకూ సాగదీస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2.25 లక్షల మంది ఎస్‌‌‌‌ఐ ఎగ్జామ్ రాయగా, 6.03 లక్షల మంది కానిస్టేబుల్ పరీక్ష రాశారు. ఈ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని లక్షల మంది హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. రిక్రూట్‌‌‌‌మెంట్ ఆలస్యం అవుతున్నకొద్దీ రూమ్ రెంట్లు, కోచింగ్ ఫీజు, గ్రౌండ్‌‌‌‌ ఫీజు, ఫుడ్ తదితర ఖర్చులు నిరుద్యోగులకు భారంగా మారుతున్నాయి. కొంత మంది యూనిఫామ్ జాబులు సాధించాలన్న కసితో అప్పటికే తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇలాంటి వాళ్లకు రిక్రూట్‌‌‌‌మెంట్ ఆలస్యమవుతుంటే కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. వెంటనే నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

కటాఫ్ లొల్లి తేలినా ఎందుకు ఆలస్యం?
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ ఒకే కటాఫ్‌‌‌‌  నిర్ణయించారు. కేటగిరీ ఏదైనా  కనీసం 30 శాతం మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అవుతారని ప్రకటించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. కటాఫ్ తగ్గించాలని డిమాండ్లు వ్యక్తమైనా సర్కారు పట్టించుకోలేదు. రోజురోజుకూ ఈ డిమాండ్ పెరుగుతుండడంతో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అక్టోబర్ రెండో తేదీన కటాఫ్ తగ్గిస్తూ పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఓసీలకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం కటాఫ్ నిర్ణయించింది. ఇది జరిగి వారం రోజులవుతున్నా ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. ఓఎంఆర్ పత్రాల మూల్యాంకనం మొత్తం మిషన్‌‌‌‌పైనే జరుగుతుంది. అయినా, ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

ఈవెంట్స్‌‌‌‌కు రెండు నెలలు!
కటాఫ్ మార్కులు భారీగా తగ్గడంతో కనీసం 4 లక్షల మంది కానిస్టేబుల్, లక్షన్నర మంది ఎస్‌‌‌‌ఐ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. అంత మందికి ఈవెంట్స్‌‌‌‌ నిర్వహించాలంటే 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నవంబర్  రెండో వారం వరకూ ఈవెంట్స్ నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లెక్కన జనవరి వరకూ ఈవెంట్స్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లోనే ఉంటే, జనవరి తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఈ లోపల ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో లేదా కటాఫ్ మార్కుల తగ్గింపులో ఎవరైనా కోర్టుకు వెళ్తే రిక్రూట్‌‌‌‌మెంట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.