
మహబూబాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా పొంగుతుండటంతో పలు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి దగ్గర్లోని చిన్న కృష్ణాపురం గ్రామానికి చెందిన బానోతు భూమా అనే గర్బిణీని ప్రసవం కోసం ఆమె కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కి తీసుకుపోతుండగా రాళ్ళవాగు ప్రవాహం పెరిగింది. దాంతో ఏం చేయాలో అర్ధం కాక వాళ్లందరూ వాగుకు అవతలి వైపే వుండిపోయారు. ఒకపక్క భూమాకు నొప్పులు రావాటం.. మరోపక్క వాగు పొంగడంతో వాగు దాటే పరిస్థితి లేక కుటుంబం సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ రమేష్ యాదవ్, తహశీల్దార్ రంజిత్ సంఘటన ప్రదేశానికి చేరుకొని హూటాహూటిన పెద్ద లారీ రప్పించి.. అవతల ఒడ్డు నుండి వారిని ఇవతలి ఒడ్డుకు తీసుకువచ్చారు. వెంటనే భూమాను ఆటోలో హస్పిటల్ కి తరలించారు. సమయానికి హస్పిటల్ కి చేరడంతో భూమా మగ బిడ్డకు జన్మనిచ్చింది. కష్టసమయంలో ఆదుకొని మానవత్వం చాటుకున్న ఎస్ఐ రమేష్, తహశీల్దార్ రంజిత్ లకు కుంటుంబసభ్యులు, గ్రామస్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.