డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బీభత్సం... ఎస్సైని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బీభత్సం... ఎస్సైని కారుతో ఢీకొట్టి కిలోమీటర్  ఈడ్చుకెళ్లిన డ్రైవర్
  •     తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్​ను ఢీ
  •     డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీల్లో కారు బీభత్సం
  •     ఎస్సైకి గాయాలు.. వెంబడించి పట్టుకున్న పోలీసులు
  •     రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన 

ఇబ్రహీంపట్నం, వెలుగు: డ్రంక్‌‌ అండ్‌‌ డ్రైవ్   నిర్వహిస్తున్న ఎస్ఐని ఓ కారు ఢీకొట్టి కీలోమీటర్​ దూరం ఈడ్చుకెళ్లింది. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బస్టాండ్​ వద్ద సాగర్​ రహదారిలో ఈ ఘటన జరిగింది. సాగర్  రోడ్డులో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు, సిబ్బంది డ్రంక్​ అండ్​ డ్రైవ్  తనిఖీలు చేపట్టారు. 

ఆ సమయంలో ఓ మాల్​ నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న​ కారు.. బారికేడ్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎస్సై అడ్డగించారు. దీంతో తప్పించుకునేందుకు ఎస్ఐ ఉయ్యాల మధును కారు ఢీకొట్టగా ఆయన బానెట్​పై పడ్డారు. అయినా కూడా కారు డ్రైవర్  ఆపకుండా అతివేగంగా హైదరాబాద్​ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైక్​ ను ఢీకొట్టింది. దీంతో బైక్​పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ కూడా బానెట్ పై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారును, అందులో ఉన్న ఇద్దరిని ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయత్ నగర్​కు చెందిన నితిన్‌‌‌‌గా గుర్తించారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా కారును నడిపిన కీసరి శ్రీకర్ రెడ్డికి 135 ఎంజీ ఆల్కహాల్ శాతం, నితిన్ కు 122 ఎంజీ చ్చినట్లు తెలిసింది. నిందితులపై హిట్​ అండ్​ రన్ ​కింద కేసు నమోదు చేశామని యాచారం సీఐ తెలిపారు.