ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​టౌన్, వెలుగు :  ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్​అడిషనల్​ కలెక్టర్​ రమేశ్ ​అన్నారు. అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్​లోని ప్రజావాణి హాల్​లో పౌర  సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆకలి చావుల నివారణకు దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టం - 2013 ను అమలు చేస్తూ  చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్​ కార్డుదారులకు, అంగన్​వాడీ కేంద్రాలకు, పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 13 వేల  రేషన్ కార్డుదారులకు ప్రతినెలా బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార పదార్థాలు  కలుషితమయ్యాయని, ఉన్నదాంట్లో నాణ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలన్నారు. న్యూట్రిషన్ గార్డెన్లపై  పిల్లలకు అవగాహన కల్పించాలని డీఈవో రమేశ్​కుమార్​కు సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో జరిగిన  వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, అంగన్​వాడీ టీచర్లకు మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్​డీవో శ్రీనివాస్​, డీఎస్​వో శ్రీనివాస్​, డీఎం హెచ్​వో డాక్టర్​ విజయ నిర్మల, డీఎస్​వో  రాజిరెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్​ సూర్యప్రకాశ్,  డీడబ్ల్యూవో బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 

‘మన ఊరు మన బడి’ వర్క్స్​ స్పీడప్​ చేయాలి 

'సిద్దిపేట రూరల్, వెలుగు: మన ఊరు మన బడి పథకంలో భాగంగా చేపడుతున్న వర్క్స్​ స్పీడప్​ చేయాలని సంబంధిత అధికారులను అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన  హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న మన ఊరు మన బడి పనుల పురోగతిపై స్కూళ్ల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్ పర్సన్లు, ఏఈవోలు, సర్పంచ్ లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్, డీపీవో దేవకిదేవి, జడ్పీ సీఈవో రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

యువజన ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ..

సిద్దిపేట నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 18న విపంచి కళానిలయంలో నిర్వహించే యువజన ఉత్సవాల వాల్ పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగాంగా, పెయింటింగ్, కవిత, ఫొటోగ్రఫీ వర్క్​ షాప్, ఉపన్యాసపోటీలు, సంస్కృతిక ఉత్సవాలు, యువజన సమ్మేళనం లాంటి అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9963056730, 08457222529 ఫోన్​నంబర్లలో ద్వారా సంప్రదించాలని కోరారు.

ఈతకు వెళ్లి యువకుడు మృతి

మెదక్​ టౌన్, వెలుగు :  ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా హవేలీఘనపూర్​ మండలం శమ్నాపూర్​లో శుక్రవారం జరిగింది. ఎస్సై మురళి తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన కొమ్మాట రమేశ్(24) తన ఫ్రెండ్స్​తో కలిసి స్థానిక చెక్ డ్యామ్​లో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 


డివైడర్​ను ఢీకొట్టి ట్రాక్టర్ డ్రైవర్..

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు : ఇసుక ట్రాక్టర్​ డివైడర్​ను ఢీకొనగా, డ్రైవర్​అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో శుక్రవారం జరిగింది. ఎస్సై శ్రీధర్  తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన దొంతరవేని శివకృష్ణ(24) తన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని పందిల్ల వాగు నుంచి తన ట్రాక్టర్​లో ఇసుక తీసుకువస్తున్నాడు. పట్టణంలోని సిద్దిపేట రోడ్డు లో వేగంగా వస్తున్న ట్రాక్టర్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్​ నడుపుతున్న శివకృష్ణ  కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


జనం మెచ్చిన సేవకులు జర్నలిస్టులు
ఎమ్మెల్యే రఘునందన్​రావు 

దుబ్బాక, వెలుగు : ప్రతి నిత్యం సమాజ హితం కోసం నిస్వార్ధంగా పనిచేసే జనం మెచ్చిన సేవకులు  జర్నలిస్టులు అని ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. దౌల్తాబాద్​ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన కొల్పుల శ్రీనివాస్​ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో శుక్రవారం జరిగిన ఆయన అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పాడే మోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెదిరింపులకు లొంగకుండా ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులకు సమాజం అండగా నిలవాలన్నారు. వివాదరహితుడైన శ్రీనివాస్​ మరణించడం అందరిని కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. 


పక్కా ప్లాన్​తో ధాన్యం సేకరణ చేపట్టాలి 

సిద్దిపేట రూరల్, వెలుగు: వానాకాలం ధాన్యం సేకరణలో ఇబ్బందులు కలుగకుండా పక్కా ప్లాన్​తో చేపట్టాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిల్లర్ల ప్రతినిధులతో కలెక్టర్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈసారి సుమారు 3.61 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైందని తెలిపారు.  మొత్తం దిగుబడి 9,13,300 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుండగా, దీనిలో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లు పోను 5,00,645 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 411 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. 

దీపావళి తర్వాత కొనుగోళ్లు

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​జిల్లాలో దీపావళి తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్​కలెక్టర్​ రమేశ్​ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి శుక్రవారం స్థానిక ద్వారకా ఫంక్షన్ హాల్​లో ఫ్యాక్స్ అధ్యక్షుడు, ఐకేపీ మార్కెటింగ్, వ్యవసాయాధికారులు, పౌర సరఫరాల ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 2 లక్షల 94 వేల ఎకరాలలో వరి వేయగా, 6 లక్షల 79 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందన్నారు. అందులో రైతుల అవసరాలు, విత్తనాలకు పోగా మార్కెట్​కు 5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని తెలిపారు.  40 రోజులలోగా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని, అందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,  ఐకేపీ ఆధ్వర్యంలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో డీఎస్​వో శ్రీనివాస్​, డీఏవో ఆశాకుమారి, డీఆర్​డీవో శ్రీనివాస్, డీసీవో కరుణ, మేనేజర్​ గోపాల్, ఆర్డీవో సాయిరామ్, డీసీసీబీ హన్మంతరెడ్డి, అనంతరెడ్డి, ఫ్యాక్స్ ప్రెసిడెంట్, డీపీఎంలు, ఏపీఎమ్​లు, రైస్​మిల్లుల యజమానులు పాల్గొన్నారు. 


మెదక్​లో కెనరా బ్యాంక్​ కొత్త బ్రాంచ్​ ప్రారంభం

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్, ఏటీఎంను  శుక్రవారం అడిషనల్ ​కలెక్టర్​ ప్రతిమాసింగ్ ​ప్రారంభించారు. అంతకుముందు బ్రాంచ్ మేనేజర్ విష్ణువర్ధన్,  సిబ్బంది అడిషనల్​కలెక్టర్​ తోపాటు  సర్కిల్ హెడ్ పట్నాయక్​కు పూలబొకేలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్​ మాట్లాడుతూ మెదక్ బ్యాంకు ఖాతాదారులకు, వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కోరారు. పట్నాయక్ మాట్లాడుతూ వినియోగదారుల సహకారంతోనే బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు. ఖాతాదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడం కెనరా బ్యాంకు లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో 366 బ్రాంచీలు, 425 ఏటీఎం ఉన్నాయన్నారు. దేశంలో రూ.20 లక్షల కోట్ల వ్యాపారం కలిగి ఉందన్నారు. మెదక్​లో తమ బ్యాంకు బ్రాంచి మొదటిదని, బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. రీజినల్ మేనేజర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కెనరా బ్యాంకు అందిస్తోందన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని కెనరా బ్యాంక్ సేవలతో ప్రజల ఆదరణ చూరగొంటామని బ్రాంచ్ మేనేజర్ విష్ణువర్ధన్ అన్నారు. కార్యక్రమంలో డీఎం సత్యరమేశ్, మణికాంత్, ఫణీందర్, తదితరులు పాల్గొన్నారు. 

పోడు భూముల సర్వే షురూ..

మెదక్ (కౌడిపల్లి), వెలుగు:  మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని బతుకమ్మ తండాలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోడు భూముల సర్వే నిర్వహించారు. కౌడిపల్లితో పాటు మండలంలోని వెల్మకన్న, భుజరంపేట్, రాజిపేట్, కూకుట్లపల్లి, ముట్రజ్​ పల్లి గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. సర్వే నిర్వహించి, అనంతరం గ్రామాల్లో గ్రామసభ పెట్టి రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) కమిటీల ద్వారా పోడు భూములు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. కౌడిపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్​ రాజమణితోపాటు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి సర్వే లో పాల్గొన్నారు. 

పోలీసులకు రెయిన్​ కోట్లు

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్​జిల్లా ఎస్పీ ఆఫీసులో శుక్రవారం పోలీస్​ సిబ్బందికి రెయిన్​కోట్లు, స్వెట్టర్లు, దోమతెరలు అందజేశారు. రాత్రి, పగలు విధులు నిర్వహించే పోలీసులకు అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మెదక్​టౌన్​సీఐ మధు, ఆర్ఐ స్టోర్​నాగేశ్వర్​రావు పాల్గొన్నారు. 


గీతంలో ‘వాటర్ కలర్స్’​ పై వర్క్​ షాప్

రామచంద్రాపురం, వెలుగు :  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీలో ‘ఆకృతులను వాటర్​ కలర్స్​పై ప్రదర్శించడం’ అనే అంశంపై శుక్రవారం వర్క్​షాప్​ నిర్వహించారు. గీతం స్కూల్​ ఆఫ్​ఆర్కిటెక్చర్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్​షాప్​ను ప్రముఖ వాటర్​ కలర్స్ ఔత్సాహికుడు శ్యామ్​కర్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రూపకల్పన ప్రక్రియ ముఖ్యమైందని, సమాచారం సేకరించడం, మెరుగుపర్చడం ద్వారా ప్రాజెక్టుకు స్పష్టమైన రూపాన్ని అందించగలమని తెలిపారు. డిజైనర్ నిరంతరం సమీక్షిస్తూ తన సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వంద మాటలను ఒక్క చిత్రం ద్వారా చెప్పవచ్చని తెలిపారు. స్కూల్​ ఆఫ్​ ఆర్కిటెక్చర్​ డైరెక్టర్ ప్రొఫెసర్​సునీల్​ కుమార్, అసోసియేట్​ ప్రొఫెసర్​శమంత్​ కుమార్​ వెంకటరత్నం భట్టు పాల్గొన్నారు. 

గ్రూప్1 పరీక్ష ఏర్పాట్లు చేయాలి 

సంగారెడ్డి టౌన్/మెదక్​టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు :ఈనెల16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను ఆఫీసర్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు డాక్టర్ శరత్, ప్రశాంత్​ జీవన్ ​పాటిల్, మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ రమేశ్, సిద్దిపేట సీపీ శ్వేత, మెదక్​ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. ఈ విషయమై శుక్రవారం సంబంధిత ఆఫీసర్లతో వారు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు  చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు తప్పకుండా అమలు చేయాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో 26 కేంద్రాలలో 8654 మంది, సిద్దిపేట పట్టణంలోని 20 కేంద్రాలలో 7786 మంది, మెదక్ జిల్లాలో ఏడు సెంటర్లలో 3,312  మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.  ఉదయం 8.30  నుంచి 10.15 గంటల మధ్యలో అభ్యర్థులను సెంటర్లలోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

మెదక్ టౌన్, వెలుగు : బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో  ముందుకు సాగాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ప్రతిమాసింగ్ ​అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘ప్రస్తుత సమయం మాది.. మా హక్కులు.. మా భవిష్యత్​’ అనే అంశంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అవకాశాలు కల్పిస్తే బాలికలు అన్ని రంగాలలో రాణిస్తారన్నారు. ప్రభుత్వం మహిళల  విద్యా, ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పలువురికి సన్మానం

మెదక్​ జిల్లా నుంచి జాతీయ ఇన్​స్పైర్​లో ప్రతిభ చూపిన విద్యార్థులు, గైడ్​టీచర్లను శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ ప్రతిమాసింగ్​సన్మానించారు. సెప్టెంబర్​14, 15 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్​స్పైర్​ ప్రదర్శనలో మెదక్​ జిల్లాకు చెందిన వెల్దుర్తి మండలం మంగళపర్తి జడ్పీహెచ్ఎస్​  స్కూల్​కు చెందిన శిరీష, తూప్రాన్ జడ్పీహెచ్​ఎస్​ స్కూల్​కు చెందిన  ధనుష్ లతో పాటు గైడ్​ టీచర్లు పాల్గొన్నారు. వారిని ఆమె అభినందించారు.  

క్రీడాకారుడికి.. 

గుజరాత్​లో జరిగిన 36వ జాతీయస్థాయి క్రీడలలో సాఫ్ట్ బాల్ క్రీడా టెక్నికల్  అఫిషియల్​గా పాల్గొన్న మనోహరాబాద్​జడ్పీహెచ్​ఎస్​కు చెందిన పీఈటీ శ్యామ్​సుందర్​ను అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​ తన చాంబర్​లో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.  గత నెల 26 నుంచి ఈనెల 12 వరకు గుజరాత్​లో జరిగిన జాతీయ క్రీడలలో జిల్లా నుంచి ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.