సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్థులందరూ తిన్నాకే టీచర్లు తినాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో మధ్యాహ్న భోజన ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు భోజనం చేస్తుంటే టీచర్లు ఎవ్వరూ మానిటర్ చెయ్యట్లేదని ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు. ఆహార పదార్థాలను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు ప్రకారం రైస్, కూరగాయలు కొలత ప్రకారం ఇవ్వాలని ఫుడ్ చెకింగ్ టీచర్ ను ఆదేశించారు. విద్యార్థుల భోజనం, వసతి, చదువు విషయం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పౌష్టికాహారం తీసుకోవాలి
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులతో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ కౌమార బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీపీవో దేవకదేవి, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీఎంహెచ్వో ధనరాజ్, ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
కొమురవెల్లి: మండలంలోని మర్రిముచ్చాల, గౌరయపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లలోని వసతులను పరిశీలించారు. తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు వరి కోతలు వాయిదా వేయాలని సూచించారు. గన్నీ బ్యాగ్ లు చిరిగినవి వస్తున్నాయని రైతులు కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. అలాంటివి పక్కనబెట్టి మంచి సంచులు మాత్రమే అందజేయాలని సెంటర్సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఏపీఎంలు, సెంటర్ సిబ్బంది, రైతులు ఉన్నారు.
