వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం .. సిద్దిపేట జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు

వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం .. సిద్దిపేట జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు
  • గతేడాదితో పోలిస్తే పెరగనున్న సాగు విస్తీర్ణం
  • అత్యధికంగా వరి వేసే చాన్స్​
  • వ్యవసాయ శాఖ అంచనా

సిద్దిపేట, వెలుగు: వానాకాలం సీజన్ సాగు ప్రణాళికను  వ్యవసాయ అధికారులు సిద్ధం చేస్తున్నారు. నీటి వనరుల లభ్యత, వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 3.25 లక్షల మంది రైతులుండగా వానాకాలం సీజన్​లో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయవచ్చని అంచనా రూపొందించారు. 3.75 లక్షల ఎకరాల్లో వరి,1.10 లక్షల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6 వేల ఎకరాల్లో కందులు, మరో 40 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో 10 వేల ఎకరాలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో రోహిణీ కార్తె ప్రారంభంతో వానాకాలం సీజన్ పనులను మొదలుపెట్టే అవకాశం ఉండడంతో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఆఫీసర్లు రెడీ చేస్తున్నారు. 

డిమాండ్ కు తగ్గట్టుగా.. 

వానాకాలం సీజన్ లో డిమాండ్ కు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్ లో 51 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో పాటు 44 వేల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు  అంచనా వేశారు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులను కేటాయించింది. వానాకాలం సీజన్ లో ఏఏ నెలల్లో ఎంత మేర ఎరువులు అవసరమనే విషయాన్ని గుర్తించి ప్రణాళికలు రూపొందించారు. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర విత్తనాలను ఈ నెలాఖరులోగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో నకిలీ విత్తనాలు మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖతో వ్యవసాయ అధికారులు కలిసి ఈ విషయంపై  ప్రత్యేక దృష్టిపెట్టారు. మార్కెట్​లోకి వివిధ పేర్లతో నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు కొనుగోలు చేసేముందు పరిశీలించాలని, రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

వరి సాగుపైనే అన్నదాతల మొగ్గు 

జిల్లాలో సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో 3.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో గతేడాది కంటే ఎక్కువగా పండిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈసారి వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు వరిపైపు మొగ్గు చూపవచ్చు. దీనికి తోడు వానాకాలంలో భూగర్భజలాలు పెరిగి బోర్లలో నీరు సమృద్ధిగా ఉండడం వరి సాగుచేసే రైతులకు కలిసివస్తుంది. జిల్లాలో డెబ్బె శాతానికి పైగా బోర్ల పైనే ఆధారపడి  రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీజన్ ప్రారంభంలోనే  నారు పోసుకుంటే పంట తొందరగా చేతికి రావడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల బారిన పడే అవకాశం ఉండదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న సాగు ఖర్చు

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత వానాకాలం సీజన్ లో సాగు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దున్నకాలతో పాటు విత్తనాలు, కూలీల రేట్లు పెరిగి రైతులపై అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లతోనే దున్నకాలు చేస్తుండడంతో ఇంధన ఖర్చు పేరిట ట్రాక్టర్ల కిరాయి పెరిగింది. గతంలో ట్రాక్టర్ తో ఎకరం దున్నితే రూ.2500 తీసుకోగా ప్రస్తుతం రూ.3 వేలు డిమాండ్ చేస్తున్నారు.  కొన్నిచోట్ల జోడెడ్ల కిరాయిలను సైతం పెంచారు. 

వానాకాలం సీజన్ పంటల సాగు విస్తీర్ణం ఎకరాల్లో

వరి    3,75 లక్షలు
పత్తి    1.10లక్షలు
మొక్కజొన్న    30వేలు
కంది    6వేలు
ఇతర పంటలు    40 వేలు
జిల్లాలో ఎరువుల డిమాండ్
యూరియా    44 వేల టన్నులు
కాంప్లెక్స్    51 వేల టన్నులు