బెజ్జంకి ఎస్సై పై అవినీతి ఆరోపణల కేసులో మరో ట్విస్ట్

బెజ్జంకి ఎస్సై పై అవినీతి ఆరోపణల కేసులో మరో ట్విస్ట్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఎస్సై అభిలాష్ పై అవినీతి ఆరోపణల కేసు మరో మలుపు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం సిమెంట్ లోడ్ తో  ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇద్దరు లారీ డ్రైవర్లు..బెజ్జంకి మండలం తోటపల్లి దగ్గర 1040 సిమెంట్ బస్తాలు అక్రమంగా అమ్ముకున్నారు. వీటిని కొనుగోలు చేసిన బోయినపల్లి కృష్ణారావు సహా మరో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే కేసును తప్పించేందుకు ఎస్సై అభిలాష్, కానిస్టేబుల్ నాగరాజు తన దగ్గర లక్ష రుపాయలతో పాటు సిమెంట్ బస్తాలకు సంబంధించిన 3 లక్షల 40 వేలు తీసుకుని అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తూ బోయినపల్లి కృష్ణారావు సిద్దిపేట సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశాడు. దీంతో సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎస్సై అభిలాష్, కానిస్టేబుల్ నాగరాజు కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐతే  ఫిర్యాదు దారు కృష్ణారావుపై గతంలో ఇసుక అక్రమ రవాణా కేసు పెట్టినందుకే కక్ష సాధింపు చర్యకు దిగాడని ఎస్సై ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ఈ నెల 3న 1040 సిమెంట్ బస్తాలు కృష్ణా రావు మరో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా అమ్ముకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని వివరించారు. లారీ ఓనర్ సాజీద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఎలాంటి లంచం తీసుకోలేదని ఎస్సై లేఖలో పేర్కొన్నారు.

ఎస్సైకి మద్దతుగా సిమెంట్ బస్తాలు కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు  సీపీకి లేఖ రాశారు. ఈ విషయంలో కృష్ణారావు తప్పుడు ఆరోపణలు చేశాడని, ఎస్సై అభిలాష్ ఎలాంటి తప్పు చేయలేదని వారు వెల్లడించారు. ఐతే వీటన్నింటిని పరిశీలించిన ఉన్నతాధికారులు సిమెంట్ బస్తాలు పక్క దారి పట్టిన కేసులో పోలీసులు, ఫిర్యాదుదారుల పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది…….