పదేండ్లయితున్నా పరిహారం అందలే.!

V6 Velugu Posted on Jun 11, 2021


సిద్దిపేట, వెలుగు: భూమిని నమ్ముకున్న రైతన్నకు అధికారులు మొండిచేయి చూపారు. కాలువ తవ్వితే నీళ్లొచ్చి సాగు పెరుగుతుంది.. కుటుంబాలు బాగుపడతాయన్న ఆఫీసర్ల మాటలు నమ్మిన రైతులు నట్టేట మునిగారు. దశాబ్ద కాలం క్రితం ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ తండా వాసులు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చారు. అందుకు పరిహారం అందకపోగా ప్రాజక్టు రీడిజైన్ లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ వచ్చి గ్రామాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏండ్లు గడిచినా పరిహారం మాత్రం చేతికి అందలేదు. దశాబ్దం క్రితం ఇచ్చిన భూమికి పరిహారం గురించి అడగటం వృథా అని అధికారులు చెబుతుండటం వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఎప్పటికైనా పరిహారం అందకపోతుందా అని ఎదురు చూసిన తండావాసుల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందగా మిగిలిన వారు గ్రామాన్ని విడిచిపెడుతున్నారు.

కాల్వ కోసం భూ సేకరణ

తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్​మధిర గ్రామమైన తండా పరిధిలో 2012లో ప్రాణహిత– చేవేళ్ల సుజల స్రవంతి ప్రధాన కాల్వ ప్యాకేజీ 13  నిర్మాణంలో భాగంగా భూములను సేకరించారు. వీరితోపాటు వేములఘాట్, బ్రాహ్మణ బంజేరుపల్లి, తురక బంజేరుపల్లి గ్రామాల రైతులకు భూ సేకరణ కోసం నోటీసులిచ్చినా అక్కడి రైతులు వాటిని  తీసుకోలేదు. భూములు ఇవ్వలేదు.  లావాణి పట్టాలు పొందిన ఏటిగడ్డ కిష్టాపూర్  తండాకు చెందిన గిరిజన రైతులు 30 మందికి  సంబంధించి న 40 ఎకరాలకుపైగా ప్రభుత్వం సేకరించింది. లావాణి పట్టా  భూమిని సేకరించే సమయంలో జారీ నోటీసుల్లో పరిహారం ఇస్తామని  ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఎలాగూ పరిహారం ఇస్తారని, దీనికి తోడు  కాల్వ వస్తే వ్యవసాయం బాగు పడుతుందని గిరిజన రైతులు భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. 2014 లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేయడంతో కాల్వ పనులు సగంలో ఆగిపోయాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ సమీపంలో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను నిర్మించాలని సంకల్పించడంతో ఈ కాలువ అటకెక్కింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం భూ సేకరణ జరపడంతో ఇప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్ తండా ముంపునకు గురవుతోంది. కాల్వ కోసం భూమిని.. రిజర్వాయర్ కోసం ఇల్లు వాకిలి కోల్పోయారు. దశాబ్దం క్రితం సేకరించిన భూములకు సంబంధించి పరిహారం కోసం గిరిజన రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో తండా ముంపునకు గురవుతుండటంతో ఇప్పుడు గ్రామాన్నే ఖాళీ చేశారు.  గతంలో సేకరించిన భూమికి సంబంధించిన  పరిహారం మాటేంటని ఆఫీసర్లను అడిగితే ఇక మరచిపోవడం మంచిదనే సమాధానం వస్తోంది. 

ఇప్పటికైనా పరిహారం ఇవ్వాలె

అధికారుల మాట నమ్మి ప్రాణహిత–చేవేళ్ల కాల్వ కోసం  భూమి ఇచ్చాం. పదేండ్లు గడుస్తున్నా తీసుకున్న భూమికి ఇంతవరకు సర్కారు పరిహారం ఇవ్వలేదు. కాల్వ నిర్మాణం వల్ల మూడెకరాల భూమి పోయింది. ఇప్పుడేమో మల్లన్న సాగర్​ ప్రాజెక్టు కింద మొత్తం తండానే మునిగిపోతోంది. ఇప్పటికైనా పేదల నుంచి తీసుకున్న భూమికి పరిహారం ఇవ్వాలి.
- పానుగోతు రవి, నిర్వాసితుడు, ఏటిగడ్డ కిష్టాపూర్

మూడెకరాలు పోగొట్టుకున్నాం

కాల్వ నిర్మాణం కోసం పదేండ్ల కింద మూడెకరాలు గుంజుకుండ్రు. మొదట పరిహారం ఇస్తమని చెప్పిండ్రు. తరువాత  అందరూ మరచిపోయిండ్రు. ఇప్పుడేమో ఆ ప్రాజెక్టు లేదు.. కొత్తదొచ్చిందని చెప్పవట్రి. మూడెకరాలు పోవడంతో కుటుంబ పోషణ కరువైంది. పరిహారం రాలేదనే బెంగతో కొడుకు గుండెపోటుతో చని పోయిండు. ఇప్పటికైనా పరిహారం ఇస్తే బాగుంటుంది. 
– బానోతు భూలి, నిర్వాసితురాలు, ఏటిగడ్డ కిష్టాపూర్ తండా

Tagged siddipet, residents, Thoguta Mandal , Atigadda Kishtapur Tanda , receive compensation

Latest Videos

Subscribe Now

More News