
- 180 గ్రూప్ ల ఏర్పాటుకు అధికారుల కసరత్తు
- ఒక్కో గ్రూప్లో 5 నుంచి 10 మంది సభ్యులు
సిద్దిపేట, వెలుగు: వీధి వ్యాపారులు ఆర్థికంగా బలోపేతంకావడానికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారులతో ప్రత్యేక పొదుపు సంఘాలను ఏర్పాటు చేయించి వారికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీ పరిధిలో మెప్మా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన తర్వాత 12,253 మంది వీధి వ్యాపారులను గుర్తించింది. వీరితో 180 సంఘాలను ఏర్పాటు చేయించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో గ్రూపులో 5 నుంచి 10 మంది సభ్యులు ఉండనుండగా పురుషులు, మహిళలను వేర్వేరుగా గ్రూప్ లనుచేయనున్నారు. ఇప్పటికే సిద్దిపేట మున్సిపాలిటీలో గ్రూపుల ఏర్పాటు ప్రారంభం కాగా మిగిలిన మున్సిపాలిటీలో త్వరలో ప్రారంభించనున్నారు.
వీధి వ్యాపారులకు శిక్షణ
వీధి వ్యాపారుల గ్రూపుల్లోని సభ్యులకు మెప్మా అధికారులు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గ్రూపులను ఏర్పాటు చేసి 6 నెలల కాలం పొదుపు ప్రక్రియను పరిశీలించిన తర్వాత బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరుచేయించనున్నారు. 6 నెలల కాలపరిమితిని పూర్తి చేసుకున్న గ్రూపులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ రుణాలతో వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలో మెప్మా అధికారులు వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ గ్రూపు సభ్యులకు రూ.363 తో ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
సిద్దిపేటలో స్పెషల్ వెండింగ్ జోన్
వీధి వ్యాపారుల కోసం సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో పీఎం స్వనిధి పథకం కింద స్పెషల్ వెండింగ్ జోన్ ను ఏర్పాటు చేశారు. నాలుగేండ్ల కింద వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి 45 దుకాణాలు ఏర్పాటు చేసి వారికి కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ వీధి వ్యాపారులు తమకు కేటాయించిన షెడ్లలో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఎన్జీవో, కాళ్లకుంట, హౌజింగ్ బోర్డు కాలనీల్లో ప్రత్యేకంగా వెజిటెబుల్ మార్కెట్లను ఏర్పాటు చేశారు.
వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు
జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నాం. ఆయా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించి వారి వ్యాపార అభివృద్ధికి చేయూతనందిస్తాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకు రుణాలు అందించడం వల్ల వారు ఆర్థికవృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
హన్మంతరెడ్డి, మెప్మా జిల్లా ఇన్చార్జి