ఉత్తర తెలంగాణ పామాయిల్ సాగుకు కేంద్రంగా సిద్దిపేట

ఉత్తర తెలంగాణ పామాయిల్ సాగుకు కేంద్రంగా సిద్దిపేట

నర్మెట్ట ఫ్యాక్టరీతో ఉత్తర తెలంగాణ పామాయిల్ సాగుకు సిద్దిపేట ప్రధాన కేంద్రంగా మారబోతోందని, రైతులంతా పామాయిల్ సాగు వైపు మొగ్గుచూపాలని  రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగే శ్వరరావు, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించి రిఫైనరీ పనులకు శంకుస్థాపన చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 3,600 కోట్ల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 32 ఎకరాల్లో  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ. 300 కోట్లతో కేవలం 16 నెలల స్వల్ప కాలంలో నిర్మించినట్టు చెప్పారు. గెలలు అమ్మిన మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడ్తాయని చెప్పారు. 

దేశంలో మొదటిసారి 21,671 కోట్ల రుణాలను ఏక కాలంలో మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్​ ప్రభుత్వానిదేనని చెప్పారు.  అంతకుముందు ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను, హెలిప్యాడ్ ను, 150 స్టాల్స్ ను, ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని, సభాస్థలిని మంత్రులిద్దరూ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, సీడ్స్ కార్పొ రేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు.