కరోనా తగ్గినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నయ్!

కరోనా తగ్గినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నయ్!

కరోనా వచ్చుడేమో కానీ దాని వెంట వస్తున్న తంటాలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. సాధారణ లక్షణాలున్నప్పుడు కొన్ని మందులు వాడి ఎలాగో అలా బయటపడ్డామనుకుంటే ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటు కరోనా తీవ్ర లక్షణాలు వచ్చి హాస్పిటల్​లో అడ్మిట్​అయి ట్రీట్​మెంట్​ తీసుకుని కోలుకున్నప్పటికీ ఇతర సైడ్​ఎఫెక్ట్స్ మళ్లీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే దీనంతటికి తీసుకుంటున్న మెడికేషన్, అప్పటికే ఒంట్లో ఉన్న దీర్ఘకాలిక రోగాలు కూడా కారణమవుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని టెస్టులు చేయించుకుని, అప్రమత్తంగా ఉంటే ఏ సమస్య ఉండదని సూచిస్తున్నారు. ఫస్ట్​ వేవ్​లో ఒంటి నొప్పులు, నీరసం, ఆయాసం, కొంతమందికి గుండె జబ్బు సమస్యలు వచ్చాయి. డాక్టర్లను సంప్రదించిన వారు మెడికేషన్​ తీసుకుని కొంతవరకు ఆరోగ్యాన్ని మెరుపర్చుకున్నారు. గతేడాది ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో పోస్ట్​ కొవిడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించారు. అయితే సెకండ్​ వేవ్​లో బ్లాక్​ ఫంగస్​తో పాటు వైట్​ ఫంగస్​ ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తుండటంతో కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆందోళన మొదలైంది.

ఈ పరీక్షలు చేసుకోవాలె..

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. కోలుకున్న తర్వాత అంటే 15 నుంచి 30 రోజుల వరకూ ఆక్సిజన్, జ్వరం, బీపీ, షుగర్​ లెవెల్స్​పరీక్షించుకుంటూ ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. పోస్ట్- కొవిడ్‌‌‌‌లో కొందరిలో కండరాల బలహీనత అధికంగా ఉంటోందని తేలింది. అలాంటి వారు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.  కొవిడ్ చికిత్సలో తీసుకున్న మందుల వలన కొన్ని దుష్ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. సీబీపీ (కంప్లీట్​ బ్లడ్​ పిక్చర్) రక్త పరీక్ష చేసుకోవాలి. బ్లడ్​ క్లాట్స్​ ఉన్నాయో లేదో దాని కోసం డీ డైమర్, ఎల్​డీహెచ్​(ల్యాక్టెట్​ డీ హైడ్రోజినేజ్), ఐరన్​ ఎలా ఉందో చూసుకునేందుకు సీరంఫిరటిన్​లెవెల్స్​ చెక్​ చేసుకోవాలి. వీటికి అనుగుణంగా డాక్టర్​ ఇచ్చే మందులు, సలహాలు తీసుకుంటే సరిపోతుంది. స్టెరాయిడ్స్ ​ఎక్కువగా వాడుతుండటం వల్ల కొందరికి కరోనా నుంచి షుగర్​ అటాక్​ అవుతోంది. వీటికి పరీక్షలు చేయించుకోవాలి. మరోవైపు చాలామంది ఇప్పటికీ కరోనా అంటే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం అని అనుకుంటున్నారు. లంగ్స్​ మీదనే ఎఫెక్ట్ ​చూపిస్తుందని భావిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం గుండె, మెదడు, కండరాలు, రక్తం, కళ్లు, శరీరంలోని అనేక ఇతర అవయవాలపై కూడా ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. కోలుకున్నాక గుండె పోటు, నిస్సత్తువ, అలసట, ఒళ్లు నొప్పులు, రక్తం గడ్డకట్టడం, బ్లాక్ ఫంగస్‌‌‌‌ లాంటి సమస్యలు వస్తున్నాయి. బాగా అయిపోయామనే ధీమాతో పోస్ట్- కొవిడ్‌‌‌‌లో శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయొద్దని.. సమస్యలుంటే  వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇమ్యూనిటీ తగ్గటంతో..

కరోనా వచ్చి తగ్గిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలోనే ఇతర జబ్బులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రధానంగా  కొవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్​ వాడటం, ఆక్సిజన్‌‌‌‌ అందించేటప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో బ్లాక్​ ఫంగస్​ అటాక్​ అవుతున్నట్లు ఎక్స్​పర్ట్స్​ వెల్లడిస్తున్నారు. అలాగే ఆక్సిజన్  ఉపయోగించే హ్యుమిడిఫయర్‌‌‌‌లో స్టెరైల్‌‌‌‌ వాటర్‌‌‌‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుందంటున్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత  జలుబు, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలను సాధారణ లక్షణాలుగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.