ఎస్​పీడీ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం..మహిళా ఉద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

ఎస్​పీడీ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం..మహిళా ఉద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • మహిళా ఉద్యోగులనూ ఈడ్చుకుపోయి అరెస్టు చేసిన పోలీసులు 
  • పోలీస్ స్టేషన్లలోనూ ఉద్యోగుల నిరసన


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని, మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ‘చలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్  డైరెక్టరేట్ (ఎస్​పీడీ)’  కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. క్లస్టర్ స్థాయి వరకూ ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్​ఎస్ఏ పరిధిలో పనిచేస్తున్న స్కూల్ కాంప్లెక్స్, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు, కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులు హైదరాబాద్​ లక్డీకపూల్ లోని ఎస్​పీడీ ఆఫీస్​కు బుధవారం ఉదయం నుంచే భారీ ఎత్తున చేరుకున్నారు.  


ఆఫీస్ చుట్టూ పోలీసులు బారికేడ్లు వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వైపుల నుంచి ఉద్యోగులు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్యోగులంతా గేటు ముందే బైఠాయించి, ఆందోళన కొనసాగించారు. వందలాది మందిని  పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగులను కూడా వ్యాన్లలోకి ఈడ్చిపడేశారు. గోషామహల్, బొల్లారం, అల్వాల్, ఆబిడ్స్, శామిర్ పేట్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీస్​ స్టేషన్లలోనూ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. వీరికి మద్దతిచ్చేందుకు వచ్చిన ఎంపీ  ఆర్.కృష్ణయ్యతో పాటు పీసీసీ రాష్ట్ర నాయకులు హర్షవర్ధన్​రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 


సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేతలు స్వరూప, ఎం.సురేందర్, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, యాదగిరి మాట్లాడుతూ... సమగ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్​ఎస్​ లను విద్యాశాఖలో విలీనం చేసి, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్​ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ, మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలన్నారు.  మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు  వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. 


కాంట్రాక్టు ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని , పీఎఫ్​, హెల్త్​ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు సంతోష్, సరిత,స్వప్నరెడ్డి, దుర్గం శ్రీనివాస్, మధుసూధన్ , దామోదర్, విజయచారి, కృష్ణారెడ్డి, అనిల్ చారి, రాఘవేంద్రనాయుడు, రాజు, రవీందర్, మల్లేష్ గౌడ్, శ్రీలతరెడ్డి, భారతి, ప్రవీణ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

డీసీఎం డ్రైవర్​పై పోలీసుల దౌర్జన్యం

సమగ్ర శిక్ష ప్రాజెక్ట్​ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టులు జరుగుతున్న క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ప్రైవేటు వాహనాల వారిపై జులం ప్రదర్శించారు. ఓ డీసీఎంను నిలిపివేసి, అరెస్టు అయిన వాళ్లను ఆ వాహనంలో పోలీస్ స్టేషన్​కు తీసుకుపోవాలని హుకుం జారీచేశారు. తనకు వేరే కిరాయి ఉందని, రాలేనని సదరు డీసీఎం డ్రైవర్​ చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో ఆ డ్రైవర్​ వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. చివరికి పోలీసులు వెనక్కి తగ్గారు.