కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 7 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం

కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 7 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం

కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలకు మరొక్క రోజే మిగిలి ఉండటం.. ఆదివారం (మే 25) సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా క్యూ కట్టారు. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కాళేశ్వరం వైపు బారులు తీరాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మార్గంలో సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. 

ఆదివారం తెల్లవారు జాము నుంచి భక్తులు కాళేశ్వరం కు చేరుకుంటున్నారు. భారీ ట్రాఫిక్ జాం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వర్షం కూడా కురుస్తుండటంతో రహదారుల్లో బురద పేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

భారీ ట్రాఫిక్ జాంతో వాహనాలు చీమల బారుల్లా నిలిచిపోయాయి. కాళేశ్వరం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) వంతెన పై ఆగి వున్న కారు ను మరో కారు ఢీ కొట్టింది. కారును ఢీకొట్టి సడెన్ గా ఆగిపోవడంతో నాలుగు వాహనాలు వరుసగా  ఒకదానికొక్కటి  వెనుక నుండి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. 

క్రమక్రమంగా పెరిగి పోతున్న ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. రహదారి నుంచి కాకుండా అడవి మార్గంలో వాహనాలను మళ్లించారు. అక్కడ కూడా కాసేపు ట్రాఫిక్ జాం అవ్వడంతో దగ్గరుండి వాహనాలను క్లియర్ చేస్తున్నారు పోలీసు అధికారులు. 

ఇక కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో ఆదివారం (మే 25) గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ కు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘన స్వాగతం పలికారు. త్రివేణి సంగమం దగ్గర గవర్నర్ దంపతులు  పుష్కర స్నానం ఆచరించారు.అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

కాళేశ్వరం పుష్కరాలు సోమవారం (మే 26) నాడు ముగుస్తున్నాయి. మే 15 నుంచి నిర్విరామంగా సాగుతున్న పుష్కరాల్లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు. సోమవారం చివరి రోజు కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.