అమెరికాలో మరో జాతి విద్వేష దాడి

 అమెరికాలో మరో జాతి విద్వేష దాడి

 

  •   ఇటీవలే హిందూ పూజారిపై అటాక్
  •   తాజాగా సిక్కు మతాధికారిపై దాడి
  •   ‘‘కంట్రీ, కంట్రీ, గో బ్యాక్, గో బ్యాక్” అని దుండగుడి అరుపులు

అమెరికాలో మరో జాతి విద్వేష దాడి జరిగింది. ఇటీవలే హిందూ పూజారిపై జరిగిన అటాక్​మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది.  కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారా పూజారి అమర్జిత్​ సింగ్​పై గురువారం రాత్రి ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. గురుద్వారా ఆవరణలోని తన ఇంట్లోకి మాస్క్​ధరించిన ఓ దుండగుడు కిటికీని పగులగొట్టుకుని లోపలికి వచ్చాడని, తన మెడపై పిడిగుద్దులు కురిపించాడని ఆయన వెల్లడించారు. నీ దేశానికి నీవు వెళ్లిపో అని అరుస్తూ బూతులు తిడుతూ.. దాడి చేశాడని చెప్పారు. శాన్​ఫ్రాన్సిస్కోకు వంద మైళ్ల దూరంలో ఉన్న మోడెస్టో సెరెస్​సిఖ్​టెంపుల్​ వద్ద ఈ సంఘటన జరిగింది. ‘‘కంట్రీ, కంట్రీ, కంట్రీ, గో బ్యాక్, గో బ్యాక్, కంట్రీ” అని అతడు అరిచాడని  ఫ్రెస్నో బీ అనే లోకల్​న్యూస్​పేపర్​కు సింగ్ తెలిపారు. జాతి విద్వేషంతోనే ఈ దాడి జరిగిందని గురుద్వారా సభ్యుడు, మోడెస్టో సిటీ కౌన్సిల్​మాన్​ మణి గ్రివాల్​చెప్పారు. అయితే, అప్పుడే ఈ విషయాన్ని నిర్ధారించలేమని, దీనిపై విచారణ ప్రారంభించిన లోకల్​పోలీసులు చెప్పారు. లోకల్​సెనెటర్​జోష్​హర్డర్​ఈ దాడిని ఖండించారు. సిక్కు మిత్రులకు తాను అండగా ఉంటానన్నారు. ఒక మైనారిటీ వర్గంపై దాడి జరిగితే అన్ని మైనారిటీ వర్గాలపై జరిగిన దాడిగానే చూడాలన్నారు. కాగా, న్యూయార్క్​సమీపంలోని గ్లెన్​ఓక్స్​లో గల శివ శక్తి పీఠం వద్ద స్వామి హరీశ్​చందర్​పూరి అనే పూజారి జూలై 18న నడుచుకుంటూ వెళుతుండగా, ఓ వ్యక్తి దాడి చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి సెర్గియో గౌవియా అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.