వెండి నేల చూపులు.. కేజీ ధర రూ.2 లక్షల దిగువకు

వెండి నేల చూపులు.. కేజీ ధర రూ.2 లక్షల దిగువకు
  • ఈ ఏడాది జనవరిలో రూ.4.2 లక్షలు..సగానికి పైగా డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఫెడ్ రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం గరిష్టాల్లోకి చేరడమే కారణం
  • జనవరి నుంచి రూ.38 వేలకు పైగా తగ్గిన బంగారం ధర 

ముంబై:   వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కేజీ ధర  ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ గరిష్టమైన రూ.4.2 లక్షల నుంచి ఇప్పుడు రూ.2 లక్షల దిగువకొచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో   గత  శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.6,800 నష్టపోయిన వెండి, రూ.1,92,800 వద్ద ముగిసింది.  దీంతో  ధరలు తిరిగి కిందటేడాది డిసెంబర్ స్థాయికి వచ్చాయి.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే ఆందోళనలే ఇందుకు కారణం.

జనవరిలో నమోదైన ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ రికార్డు గరిష్టం రూ.4,20,048తో పోలిస్తే వెండి ప్రస్తుతం ఏకంగా 50 శాతానికి పైగా పడిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో   రూ.2,48,800 వద్ద గరిష్టాన్ని తాకగా, అక్కడి నుంచి  22.5శాతం,  గత 10 ట్రేడింగ్ సెషన్లలో 14 శాతం (కేజీకి రూ.32,955) పడింది. ఈ నెలలో  ఇప్పటివరకు 6.38శాతం దిగొచ్చింది. 

లాంగ్‌‌‌‌‌‌‌‌టర్మ్‌‌‌‌‌‌‌‌కు కొనొచ్చు!

వరుసగా ఐదో వారం నష్టాల బాట పట్టిన వెండిలో.. ఈ పతనం కొనుగోలుకు మంచి అవకాశమా అనే చర్చ ఇన్వెస్టర్లలో మొదలైంది. మార్కెట్ నిపుణుల ప్రకారం వెండికి అంతర్జాతీయంగా 50-–55 డాలర్ల రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి),  భారత ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు రూ.1,80,000 - రూ.1,85,000 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (కేజీకి) కొనుగోళ్లు రావొచ్చని అంచనా. రాబోయే 10-–15 రోజుల్లో ధరలు మరింత తగ్గి ఆ స్థాయికి చేరినా, అక్కడ స్థిరపడితే మళ్లీ 10–-15 శాతం పుంజుకోవచ్చని టెక్నికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు. గతంలో అధిక ధరల వల్ల కొనలేకపోయిన లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇన్వెస్టర్లకు ప్రస్తుత ధరలు మంచి ఎంట్రీ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారవచ్చని ఫండ్ సంస్థలు చెబుతున్నాయి. అయితే చమురు ధరలు, యూఎస్ ద్రవ్యోల్బణ డేటా ఆధారంగానే తదుపరి మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయి.  కాగా, ఈ ధరలన్నీ బేస్ రేట్లు. ఇందులో జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, మేకింగ్ ఛార్జీలు వంటివి కలిసి లేవు. 

వెండికి తగ్గుతున్న డిమాండ్..

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బ్రెంట్ ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో  నిత్యావసరాలు ఖర్చులు కూడా  పెరుగుతున్నాయి. దీంతో రిటైల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  వెండి, బంగారు నగల కొనుగోళ్లు పడిపోతున్నాయి. దీనికి తోడు  ద్రవ్యోల్బణాన్ని  కట్టడి చేసేందుకు  అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ  రేట్లను పెంచుతోంది. వడ్డీ రేట్లు, బాండ్ రాబడులు పెరిగితే.. వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం, వెండిపై పెట్టుబడులకు ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా అమ్మకాలు పోటెత్తుతాయి. దీనికితోడు వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ వంటి పరిశ్రమల్లో విరివిగా వాడతారు. అధిక వడ్డీ రేట్ల వల్ల పారిశ్రామిక కార్యకలాపాలు నెమ్మదించి వెండి డిమాండ్ మరింత తగ్గింది. 

బంగారం 21 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అటు బంగారం ధరలు కూడా మూడు నెలల కనిష్టానికి దిగొచ్చాయి.  ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాముల రేటు రూ.1.40 లక్షల వద్ద కదలాడుతోంది. ఆగస్టు గరిష్టం రూ.1,64,773తో పోలిస్తే  రూ.23 వేలు తగ్గింది. బంగారం, వెండి రెండూ వరుసగా రెండో నెలా నష్టాల దిశగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలొ నమోదైన  జనవరి నాటి రికార్డు గరిష్టం రూ.1,80,779తో పోలిస్తే ఇది ఏకంగా రూ.38,600 (21.43శాతం) తగ్గింది. 

అంతర్జాతీయంగా ఔన్సు ధర 4 వేల డాలర్ల దిగువకు చేరింది. చమురు ధరల పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల భయాలు, టెక్ షేర్లలో నష్టాలతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఫ్యూచర్లను అమ్మడమే ఇందుకు కారణం. దీపావళి ముందు కొనుగోలు పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.