కిలో వెండి 82 వేల రూపాయలా.. దివాళీకి లక్ష అవుతుందా..!

కిలో వెండి 82 వేల రూపాయలా.. దివాళీకి లక్ష అవుతుందా..!

బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రోజురోజు పెరుగుతున్నాయి. 2024, ఏప్రిల్ 2వ తేదీన కిలో వెండి 82 వేల రూపాయలకు చేరింది. మంగళవారం ఒక్క రోజు 400 రూపాయలు పెరిగింది. 

వెండి ధరలు 10 రోజుల్లోనే కిలోకు 4 వేల 500 రూపాయలు పెరిగింది. 2024, మార్చి 24వ తేదీన 77 వేల 500 రూపాయలుగా ఉండగా.. ఏప్రిల్ 2వ తేదీ నాటికి కిలో వెండి 82 వేల రూపాయలకు చేరింది. వెండి ధరలు పెరగటానికి కారణం లేకపోలేదు. గృహ ప్రవేశాలు ఎక్కువగా ఉండటంతో.. గృహ ప్రవేశాల ముహూర్తాలతో వెండి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో వెండి ధరలకు రెక్కలు వచ్చినట్లు చెబుతున్నారు వ్యాపారులు.

Also Read: బంగారం ధర@ రూ.68 వేల 420

2023, డిసెంబర్ నెలలో కిలో వెండి 83 వేల 500 రూపాయల ఆల్ టైం హై ధరకు టచ్ చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 75 వేలకు పడిపోయింది. మళ్లీ 10 రోజులుగా వెండి ధరలు భారీగా పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది.. స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దీంతో తమ డబ్బును సురక్షితంగా భావిస్తున్న బంగారం, వెండిలో పెట్టుబడి పెడుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. రాబోయే దీపావళి నాటికి కిలో వెండి లక్ష రూపాయలకు చేరవచ్చని అంచనా. చూడాలి అప్పటికి పెరుగుతుందో లేక తగ్గుతుందో అని..