2018 నుంచి రైతులకు అందని విత్తన రాయితీ

2018 నుంచి రైతులకు అందని విత్తన రాయితీ

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు: రాయితీ విత్తనాల పేరు నాలుగేండ్ల నుంచి వినిపించడం లేదు. దీంతో యాసంగిలో వేరుశనగ, పెసర, కందులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, మినుములు వేయాలనుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలతో మంచి లాభాలు వస్తాయని ఓ వైపు శాస్త్రవేత్తలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రాయితీ విత్తనాలు నేటికీ అందుబాటులోకి రాలేదు.

రైతుబంధు ఒక్కటేనా?
రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి, ఇతర సబ్సిడీలన్నీ బంద్ పెట్టిందనే విమర్శలున్నాయి. ఇది నిజమే అన్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి రాయితీ విత్తనాల సరఫరాను సర్కారు బంద్ పెట్టింది. దీంతో రైతులు బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్వల్పకాలిక పంటలు అధిక లాభాలిస్తాయనుకున్న రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది.

భారమైన పల్లి..
ఆరుతడి పంటల సాగులో భాగంగా ఉమ్మడి జిల్లా రైతులు పల్లినే ఎక్కువగా సాగు చేస్తారు. ఏటా 62వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. గతంలో అగ్రోస్ సెంటర్ల ద్వారా రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేవారు. దీనికి ప్రభుత్వం 33శాతం సబ్సిడీ ఇచ్చేది. కేజీ విత్తనాలకు మార్కెట్ రేట్ రూ.95 ఉంటే.. సబ్సిడీ పోను రైతులు రూ.40 మాత్రమే చెల్లించేవారు. ఈ విషయంపై అగ్రికల్చర్ ఆఫీసర్ల వివరణ కోరగా.. 2018 నుంచే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను ఎత్తివేసిందని చెప్పారు. ఇక నుంచి రాయితీ విత్తనాలు ఉండబోవని స్పష్టం చేశారు.

ఇలా అయితే భారమే..
కేవలం రూ.5వేల రైతుబంధు ఇచ్చి, మిగిలిన పథకాలన్నీ బంద్ పెడతారా? ఇలా అయితే రైతులు బతుకుతడు ఎట్లా? 25 కేజీల విత్తనాలపైనే 1500 భారం పడుతోంది. ఇక రూ.5వేలు ఏం సరిపోతయ్? దుక్కిదున్నకాలకు, కూలీలకు ఎట్ల చెల్లించేది? నీళ్లు ఉన్నా.. వర్షాలు పడుతున్నా.. ఆరుతడి పంటలు వేయలేని పరిస్థితి ఉంది. 
- చెవిటి సుధాకర్, రైతు, హరిపిరాల