ఏడున్నరేండ్లయినా ఇంకా వాటి కోసమే కొట్లాడాలా..?

ఏడున్నరేండ్లయినా ఇంకా వాటి కోసమే కొట్లాడాలా..?
  • నీళ్లు, నిధులు, నియామకాలు ముంగట పడలే
  • ఏడున్నరేండ్లయినా వాటి చుట్టే ఆందోళనలు
  • ఆత్మరక్షణలో పడ్డ టీఆర్​ఎస్​ సర్కారు
  • నియామకాల్లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు
  • అప్పుల కుప్పగా మారిన మిగులు రాష్ట్రం
  • నానాటికీ పెరుగుతున్న ఏపీ నీళ్ల దోపిడీ
  • ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలు

 

శ్రీశైలానికి గండి కొట్టి  మన నీళ్లను ఏపీ అక్రమంగా మళ్లించుకుపోతున్నది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులతో ఏపీ జల దోపిడీ రెట్టింపైంది. శ్రీశైలంపై మరో లిఫ్టు కట్టేందుకు రెడీ అవుతోంది. మరో వైపు రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు.

తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్‌‌ -1 నోటిఫికేషన్‌‌ రాలేదు. గ్రూప్‌‌-2 నోటిఫికేషన్‌‌ ఇచ్చినా ఏండ్లకేండ్లు సాగదీశారు. రాష్ట్రంలో ఉండాల్సిన ప్రభుత్వోద్యోగులు 4.91 లక్షలు కాగా ఉన్నది 3 లక్షల మందే. అంటే 1.9 లక్షల ఖాళీలున్నాయి. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడాది కింద సీఎం ప్రకటించారు. 
అది అడుగు కూడా 
ముందుకు పడలేదు.

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ఖజానా రూ.6 వేల కోట్లకు పైగా మిగులుతో ఉంది. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసింది. ఏడేళ్లలో మొత్తం అప్పులు రూ.4 లక్షల కోట్లు దాటాయి.


హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ పోరాటానికి ఊపిరిగా నిలిచిన ఉద్యమ నినాదాలు మళ్లీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రం వచ్చి ఏడున్నరేండ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదనే అభిప్రాయం బలపడుతున్నది. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలన్నీ ఉద్యమంలో కీలక డిమాండ్లయిన నీళ్లు, నిధులు, నియామకాల చుట్టే తిరుగుతున్నాయి. పక్క రాష్ట్రం నీళ్ల దోపిడీని అడ్డుకునే దిక్కే లేకుండా పోయిందని, మిగులు రాష్ట్రం కాస్తా అప్పుల కుప్పలా మారిందని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నియామకాల ఊసే లేకుండా పోయిందని ఆందోళనలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కుతలేవని కొట్లాడి మరీ రాష్ట్రం తెచ్చుకుంటే జరుగుతున్నది ఏమిటన్న అసంతృప్తి అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్నది. వీటినే అస్త్రాలుగా చేసుకొని అపోజిషన్ పార్టీలు రోజుకో తరహాలో ఆందోళనకు దిగుతుంటే పాలక పక్షం ఆత్మరక్షణ ధోరణిలో పడిందన్న అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.

కలలుగానే కొలువులు
రాష్ట్రం ఏర్పడే నాటికి 1.5 లక్షల ఖాళీలున్నట్టు తేల్చారు. వీటిలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ వీటిలో నిజానికి తెలంగాణ వచ్చాక భర్తీ చేసింది 83,725 ఖాళీలే. రాష్ట్ర ఆవిర్భావానికి ముందే విద్యుత్‌‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు, ఆర్టీసీ, సింగరేణి, డీసీసీబీ, టెస్కాబ్‌‌లో పని చేస్తున్న 49,174 మందిని రెగ్యులరైజ్‌‌ చేశామని చెప్తున్నారు. కానీ వీరి జీతాలు పెంచారే తప్ప ఉద్యోగ భద్రతపై క్లారిటీ లేదు. రాష్ట్రం వచ్చాక ఒకే ఒక్క టీచర్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ టెస్ట్‌‌ (టీఆర్టీ) పెట్టినా పలువురికి ఇంకా పోస్టింగ్స్​ ఇయ్యలేదు.
నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారా అని యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడాది కింద సీఎం ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్లని ఎమ్మెల్సీ ఎన్నికలు, బై ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా చెప్తూ వచ్చారు. కానీ ఉద్యోగుల విభజన పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీనిపై బీజేపీ దీక్షకు దిగితే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్‌‌ మీట్లు పెట్టి బీజేపీని తిట్టిపోశారు. కేంద్రాన్ని కార్నర్‌‌ చేసి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న 2018 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిరాశా నిస్పృహలతో నిరుద్యోగులు రోజూ ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో రాష్ట్రంలో నిత్య విషాదం నెలకొని ఉన్నది.

పాత ప్రాజెక్టుల కిందే కొత్త ఆయకట్టు
కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రం తప్ప దీనికి పరిష్కారం లేదని ఉద్యమ వేళ కేసీఆర్ లెక్కలేనన్నిసార్లు చెప్పారు. ఆర్డీఎస్‌‌ నీళ్ల సాధనకు పాదయాత్ర చేశారు. శ్రీశైలానికి పోతిరెడ్డిపాడు గండి కొట్టి దక్షిణ తెలంగాణ నీటిని ఏపీ అక్రమంగా మళ్లించుకుపోతున్నదన్నారు. తీరా తెలంగాణ వచ్చాక ఏపీ జల దోపిడీ రెట్టింపైందే తప్ప మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఒరిగిందేమి లేదు. ఉమ్మడి ఏపీలో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ ఎత్తిపోతల పనులు పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోనే కొత్తగా 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. ఎస్సారెస్పీ స్టేజీ -2 కింద ఇంకో రెండున్నర లక్షలు, మిగతా ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టుల కింద మరో 3 లక్షల ఎకరాల దాకా సాగులోకి తెచ్చారు.

తెల్ల ఏనుగైన కాళేశ్వరం
రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో దానికింద ప్రతిపాదించిన ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు. ఎస్సారెస్పీ స్టేజీ -2 సహా, ఎల్‌‌ఎండీకి దిగువన ఉన్న శ్రీరాంసాగర్‌‌ ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేయడానికి మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడింది. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత వరుసగా మూడేళ్లు భారీగా వానలు పడటంతో ప్రాజెక్టులన్నీ నిండి ఎత్తిపోతలు అంతగా అవసరం పడలేదు. కృష్ణా నీళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేవి ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలు. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌లో తెలంగాణ వచ్చాక తట్టెడు మట్టి కూడా తీయలేదు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి భూమి పూజ చేసిన పాలమూరు ఎత్తిపోతల పనులు 30 శాతం కూడా కాలేదు. కోటిన్నర ఎకరాల్లో పంటలు పండుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెప్తున్నా వీటిలో ప్రాజెక్టుల కింద సాగవుతున్నది కేవలం 40 లక్షల ఎకరాలే.

రూ.6 వేల కోట్ల మిగులు నుంచి రూ.4 లక్షల కోట్ల అప్పులకు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపడే నాటికి తెలంగాణ ఖజానా రూ.6 వేల కోట్లకు పైగా మిగులుతో ఉంది. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు, పవర్‌‌ ప్లాంట్లు, అభివృద్ధి పనుల కోసం ఏడేళ్లలో ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. వీటిలో రూ.2.37 లక్షల కోట్లు ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు కాగా పలు కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి తెచ్చింది రూ.1.90 లక్షల కోట్లకు పైనే. ఆర్‌‌బీఐ బాండ్ల వేలంతో తీసుకున్న లోన్లు, వేస్‌‌ అండ్‌‌ మీన్స్‌‌, ఓవర్‌‌ డ్రాఫ్ట్‌‌ సర్దుబాట్లు వీటికి అదనం. ఇంత భారీగా అప్పులు తెచ్చినా అభివృద్ధి పనులు చాలా వరకు పెండింగే ఉన్నాయి. మరోవైపు, ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా యాసంగిలో రైతులెవరూ వరి వేయొద్దని సర్కారు ఆంక్షలు పెట్టింది. వచ్చే యాసంగి నుంచి వరి కొనేది లేదని కూడా ప్రకటించింది. ఇప్పటికే వానాకాలం వడ్లు సకాలంలో కొనకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోజూ ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు.

ఉన్నోళ్లనే తీసేసిన్రు 
కొత్త కొలువులివ్వకపోగా చిన్న జీతాలకు పనిచేస్తున్న వాళ్లను ఏకంగా 26,948 మందిని ఇంటికి పంపారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగాలే ఉండవని ఉద్యమ వేళ చెప్పిన కేసీఆర్‌‌ అన్ని శాఖల్లోనూ ఔట్‌‌ సోర్సింగ్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ కొనసాగించారు. సమ్మెకు దిగారనే కోపంతో ఏకంగా 7,500 మంది ఫీల్డ్‌‌ అసిస్టెంట్లను తొలగించారు. మిషన్ భగీరథ వర్క్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు, హార్టికల్చర్‌‌ ఔట్‌‌ సోర్సింగ్‌‌ సిబ్బంది,  స్టాఫ్‌‌ నర్సులు, ఆర్టీసీ ఔట్‌‌ సోర్సింగ్‌‌, సంక్షేమ హాస్టళ్ల సిబ్బంది, 550 మంది సాక్షర భారత్‌‌ కో ఆర్డినేటర్లు, 12,400 మంది విద్యా వాలంటీర్లు, 1,640 మంది గెస్ట్‌‌ లెక్చరర్లను ఇంటికి పంపారు. 

రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తయనుకున్నం
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. కానీ ఏడేండ్లుగా ఒక్క గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇవ్వలేదు.  ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తదని ఎదురు చూసుడే తప్ప.. మా ఆశ నెరవేరలేదు. గ్రూప్1 నోటిఫికేషన్ ఇస్తరా అనే అనుమానం కలుగుతోంది.‑ జడిగె వెంకటేశ్వర్లు, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ